ప్రారంభమైంది.. సర్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైంది.. సర్‌

Jun 26 2026 7:33 AM | Updated on Jun 26 2026 7:33 AM

ఓటర్లు ఏం చేయాలి..?

ఓటరు సవరణకు ఇంటింటికి తిరిగిన బీఎల్‌ఓలు

మ్యాపింగ్‌ లేని వారికి రుజువులు అవసరం

ఓట్లు కాపాడుకునే పనిలో ఆయా పార్టీలు

అచ్చంపేట: జిల్లాలో స్సెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) గురువారం ప్రారంభమైంది. నెలరోజుల పాటు ఈ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌ఓ)ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాలు అందజేశారు. రెండు ఫారాల్లో వివరాలు తీసుకున్న తర్వాత ఒకటి ఓటరుకు ఇచ్చి మరొకటి బీఎల్‌ఓలు తీసుకెళ్లారు. ఇలా ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్‌ ఫారాలు జూలై 24 వరకు అందజేస్తారు. నెల రోజులపాటు బీఎల్‌ఓలు వివరాలను ఫారాల్లో నమోదు చేసి సమర్పిస్తేనే ఓటు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2002 నాటి ఓటరు సవరణ ప్రకారం ఇప్పుడున్న ఓటర్ల జాబితాను బీఎల్‌ఓలు ఓటరు మ్యాపింగ్‌ చేశారు. దీని ప్రకారం జిల్లాలోని ఓటర్లకు మరోసారి ఎన్యుమరేషన్‌ ఫారాలు అందజేస్తూ ఓటరు జాబితా సవరించనున్నారు. చాలా మందికి గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఓట్లు ఉన్నాయి. ఇంకొందరు హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వా రంతా కూడా తప్పనిసరిగా ఎన్యుమరేషన్‌ ఫారా ల్లో వివరాలు అందించాల్సి ఉంటుంది. ప్రతి ఓటరును తప్పనిసరిగా కలిసేలా బీఎల్‌ఓలు కనీసం మూడుసార్లు ఇంటికి తిరగాల్సి ఉంటుంది.

కొత్త ఓటరు నమోదుకు అవకాశం..

బూత్‌ లెవల్‌ అధికారులు ఇంటికి వచ్చినప్పుడు 2026 అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండే వారి వివరాలు చెబితే ఫారం–6 ఇస్తారు. డిక్లరేషన్‌ ఫారంతోపాటు ఫారం–6 తీసుకుని వాటిని పూరించి ఇవ్వాలి. సమగ్ర సవరణకు సంబంధించి ఎన్యుమరేషన్‌ ఫారం అందకపోతే బీఎల్‌ఓలను సంప్రదించవచ్చు.

బీఎల్‌ఓలు ఇంటికి వచ్చినప్పుడు ఎన్యుమరేషన్‌ ఫారాల్లో పాత, కొత్త ఫొటోలు, ఆధార్‌కార్డు (తప్పనిసరి కాదు) ఫోన్‌ నంబరు, తల్లిదండ్రులు, భార్య/ భర్త వివరాలు నమోదు చేయాలి. 2002లో ఓటరు జాబితాలో పేరు ఉంటే ఒకవైపు.. అప్పుడు ఓటు లేకపోతే మరోవైపు వివరాలు నమోదు చేయాలి. ఇందులో కుటుంబ సభ్యుల వివరాలు అందించాల్సి ఉంటుంది. ఓటరు వివరాలు తప్పులు లేకుండా అందజేయాలి. కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వివరాలు అందించాలి. వలస వెళ్లిన వారి వివరాలు చెప్పాలి. అలాగే సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇవ్వాలి. లేకపోతే వలస వెళ్లిన చోట ఓటు కలిగి ఉంటే ఏదో ఒకచోట మాత్రమే ఎన్యుమరేషన్‌ ఫారంలో వివరాలు ఇవ్వాలి. దీంతో డబుల్‌ ఓటర్లలో ఒక ఓటు మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది. కాగా.. ఉమ్మడి జిల్లాలో 80.15 శాతమే పాత ఓటరు జాబితాలో కొత్త జాబితాను మ్యాపింగ్‌(పోల్చడం) చేశారు. ఇంకా 19.85 శాతం ఓటర్లు మ్యాపింగ్‌ పరిధిలో లేరు. ఎన్యుమరేషన్‌ ఫారాల్లో వివరాలు ఇస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధ్రువీకరించిన గుర్తింపు కార్డులు చూపించాలి. ఇంకా ఏమైనా అనుమానాస్పదంగా ఉండే ఓటర్లకు అధికారులు నోటీసులు అందిస్తారు. తగిన వివరణతో బీఎల్‌ఓలకు అందజేయాలి. అక్టోబరు 1 నాటికి కొత్త జాబితా రూపొందనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement