లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

Jun 26 2026 7:33 AM | Updated on Jun 26 2026 7:33 AM

కందనూలు: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ కృష్ణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని కార్యాలయంలో ప్రైవేట్‌ ఆస్పత్రుల గైనకాలజిస్టులు, రేడియాలజిస్ట్‌, పీడియాట్రిషన్‌లకు లింగ నిర్ధారణ నిషేధ చట్టం, క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌, గర్భస్రావ చట్టం, సంకల్ప్‌ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మాయిల సంఖ్య తగ్గితే సమాజంలో అసమతుల్యత ఏర్పడి తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగుతాయన్నారు. ఇందుకు ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ప్రైవేట్‌ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణులు అందరికీ సాధారణ ప్రసవాలు నిర్వహించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసరమైతేనే సిజేరియన్‌ కాన్పులు చేయాలని సూచించారు. తెలంగాణ క్యాన్సర్‌ పోర్టల్‌లో ప్రతి ప్రైవేటు ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ చేసుకొని, వారు గుర్తించిన క్యాన్సర్‌ కేసుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. కష్టతరమైన కాన్పులు నిర్వహించినప్పుడు చిన్నపిల్లల వైద్య నిపుణులు ఉండేలా చూసుకోవాలని, ప్రతి ప్రైవేటు ఆస్పత్రిలో తాము అందించే సేవలు రుసుంల పట్టికను తప్పకుండా ప్రదర్శించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు రవికుమార్‌, చెన్నయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement