పీఎం.. మాకేది కిసాన్‌ | - | Sakshi
Sakshi News home page

పీఎం.. మాకేది కిసాన్‌

Jun 24 2026 1:29 AM | Updated on Jun 24 2026 1:29 AM

కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వని కేంద్ర ప్రభుత్వం

అచ్చంపేట: కఠిన నిబంధనల అమలుతో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం లబ్ధిదారుల సంఖ్య ఏటేటా తగ్గతూ వస్తోంది. ఏడేళ్లలో జిల్లాలో 82,951 పైచిలుకు రైతులు ఈ పథకానికి దూరమయ్యారు. మరోవైపు పథకం ప్రారంభం నుంచి కటాఫ్‌ తేదీ మార్చకపోవడంతో కొత్త రైతులు నిరాశ చెందుతున్నారు. దీంతో కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద పెట్టుబడి సాయం అందని ద్రాక్షగా మారింది. నిబంధనల పేరిట అనర్హులను తొలగిస్తున్న కేంద్ర ప్రభుత్వం కొత్తవారికి అవకాశం కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో వారు ఈ పథకానికి దూమవుతున్నారు. పథకం ప్రారంభమైప్పటికీ నుంచి ఇప్పటి వరకు గడిచిన ఏడేళ్ల వ్యవధిలో జిల్లాలో 30 వేల మందికిపైగా కొత్తగా పాస్‌ పుస్తకాలు పొందారు.

విడతకు రూ.2 వేల చొప్పున

చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఎకరాలతో సంబంధం లేకుండా విడతకు రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో కలిపి ఏడాదికి రూ.6 వేలు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇలా పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 22 సార్లు రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసింది. కాగా జిల్లాలో 3,18,960 మంది రైతులు ఉండగా.. 6,87,215 ఎకరాలలో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో అత్యధికంగా 3,08,845 ఎకరాల్లో పత్తి, 1,92,796 ఎకరాల్లో వరి సాగువుతోందని వ్యవసాయాధికారుల లెక్కలు చెబుతున్నాయి.

కొత్తగా పాసు పుస్తకాలు పొందినవారు (సుమారు) 30,000

రైతుల ఎదురుచూపు

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద లబ్ధిపొందే రైతుల సంఖ్యను నిబంధనల పేరిట తొలగిస్తున్న కేంద్ర ప్రభుత్వం కొత్త వారికి మాత్రం అవకాశం కల్పించడం లేదు. 2019 ఫిబ్రవరిలో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ప్రారంభించినప్పుడు జిల్లాలో 1,94,140 మంది రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఆ తర్వాత నిబంధనలను కఠినతరం చేయడంతో లబ్ధిదారుల సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తోంది. పథకం ప్రారంభంలో సెల్ప్‌ డిక్లరేషన్‌ ఆధారంగా నమోదు జరిగినా.. కేంద్ర ప్రభుత్వం పథకానికి అర్హుల విషయంలో పలు నిబంధనలు తీసుకువచ్చి ఈ–కేవైసీ తప్పనిసరి చేసింది. మరోవైపు ఈ పథకం ప్రారంభమైన 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఏడేళ్లు దాటినా ప్రభుత్వం కటాఫ్‌ తేదీని మార్చకపోవడంతో కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో చాలామంది రైతులు పెట్టుబడి సాయానికి దూరమయ్యారు. తాజాగా జిల్లాలో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 1,11,189కి తగ్గింది. అంటే పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 82,951 మంది ఈ పథకానికి అర్హత కోల్పోయారన్న మాట. జిల్లాలో మొత్తం 30 వేల మందికిపైగా కొత్తగా పట్టాదారుల పుస్తకాలు పొందిన రైతులు పీఎం కిసాన్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎదురుచూస్తున్నారు. దీనికోసం ఎవరిని సంప్రదించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఏఓలు, ఏఈఓలను కలిసినా వారు కూడా సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది.

జిల్లా పరిధిలో ఇలా..

జిల్లాలో ఏటేటా తగ్గుతున్న లబ్ధిదారుల సంఖ్య

కటాఫ్‌ తేదీ మార్చాలంటున్న అన్నదాతలు

కఠిన నిబంధనలతో జిల్లాలో 82,951 మంది రైతులు దూరం

ఏడేళ్లుగా కొత్తవారికి తప్పని ఎదురుచూపులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement