కందనూలు: జిల్లాలో డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై మాట్లాడుతూ దేశంలో డ్రగ్స్ అనే మహమ్మారి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుందన్నారు. డ్రగ్స్‌కు బానిసలు కాకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండి చక్కని భవిష్యత్‌ని తీర్చిదిద్దుకోవాలని, అలాగే కుటుంబంలో, ఊరిలో, ఏ ప్రదేశంలోనైనా, ఎక్కడైనా, ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్టు, రవాణా చేస్తున్నట్టు తెలిసిన 1908కి కాల్ చేసి తెలపాలని, తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్‌రెడి, ఎస్‌ఐ గోవర్ధన్, జిల్లా ఈగల్ టీం ఎస్‌ఐ రాంలాల్‌నాయక్, మెడికల్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మాతాశిశు మరణాల నివారణకు చర్యలు
కందనూలు: మాతాశిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్‌ఓ కృష్ణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవించేలా చర్యలు తీసుకోవాలని, మాతాశిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. మాతాశిశు సంరక్షణ కార్డులో గర్భిణుల పరీక్షల వివరాలు నమోదు చేయాలన్నారు. ఈ నెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వైద్యాధికారులు, క్షేత్ర సహాయ సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు రవికుమార్, సురేష్‌బాబు, కృష్ణమోహన్, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డిగూడలో
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్
రాజాపూర్: జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడెం గ్రామంలో రూ.12 కోట్లతో నాలుగు ఎకరాల స్థలంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను ఈనెల 25న మంత్రి వివేక్ వెంకట్‌స్వామి ప్రారంభించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దూసుకుపోతున్న ఈ కంప్యూటర్ యుగంలోయువతకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను రంగారెడ్డిగూడలో ప్రారంభించుకోవడం ఎంతో శుభపరిణామమన్నారు. గ్రామశివారులో ఎస్సీ కాలనీ పక్కన టాటా కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం కార్యరూపం దాల్చబోతోందని పేర్కొన్నారు. ఇప్పటికే బాలానగర్ మండలం పెద్దాయపల్లి వద్ద యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌తో పాటు నవోదయ పాఠశాలను మంజూరు చేయించామని, జడ్చర్ల మండలం చిట్టెబోయిన్‌పల్లి వద్ద ట్రిపుల్ ఐటీ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ధాన్యం @ రూ.2,626
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,626, కనిష్టంగా రూ.2,001 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,222, కనిష్టంగా రూ.2,177 ధరలు పలికాయి.


