ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక మార్పులు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక మార్పులు

Jun 24 2026 1:29 AM | Updated on Jun 24 2026 1:29 AM

పెద్దకొత్తపల్లి/ వెల్దండ: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ (టీపీఎస్‌) ఏర్పాటు వేగవంతంగా ముందుకు సాగుతుందని విద్యాధికారులు అన్నారు. మంగళవారం పెద్దకొత్తపల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను రాష్ట్ర ఈడబ్ల్యూడీసీ క్వాలిటీ కంట్రోల్‌ అధికారి విజయభాస్కర్‌రెడ్డి, డీఈఓ రమేష్‌కుమార్‌, జిల్లాస్థాయి ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి అర్జేడీ సోమిరెడ్డి సందర్శించారు. తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌గా ఎంపికై న ఈ ప్రాంగణంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌ కళాశాలలో ఉన్న వసతులు, ప్రస్తుతం ఉన్న తరగతి గదుల పరిస్థితి, విద్యార్థుల సంఖ్య భవిష్యత్‌ అవసరాలు, నిర్మాణ అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఒక్కో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను రూ.15 కోట్లతో నిర్మిస్తుందని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే వంగూరు, పోల్కంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌గా ప్రభుత్వం ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. అలాగే జిల్లాలో కొనసాగుతున్న మోడల్‌ స్కూల్స్‌ను కూడా తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ వ్యవస్థలోకి తీసుకురావడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు నిరంతర విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్‌ సహాయంతో పాఠశాల ప్రాంగణాన్ని చిత్రీకరించి భవిష్యత్‌ అభివృద్ధి పనులకు సంబంధించిన సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఈఈ ఈడబ్ల్యూడీసీ రామచందర్‌రావు, సెక్టోరియల్‌ అధికారి వెంకటయ్య, ఎంఈఓ ఉమాదేవి, హెచ్‌ఎం భారతి, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

టీపీఎస్‌కు ఎంపికై న వెల్దండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను క్వాలిటీ కంట్రోల్‌ అధికారి విజయభాస్కర్‌రెడ్డి, జిల్లాస్థాయి ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి ఆర్జేడీ సోమిరెడ్డి సందర్శించారు. పాఠశాలలో వసతులు, తరగతి గదుల పరిస్థితి, విద్యార్థుల సంఖ్య, భవిష్యత్‌ అవసరాలు, నిర్మాణ విస్తరణ అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌లో అందుబాటులో ఉన్న సుమారు 14 ఎకరాల స్థలాన్ని అధికారులు పరిశీలించి, భవిష్యత్‌లో నిర్మించాల్సిన అదనపు తరగతి గదులు, ప్రయోగశాలలు, పరిపాలనా భవనాలు, వసతి గృహాలు, భోజనశాలలు, క్రీడా మైదానాల ఏర్పాటుకు సంబంధించిన అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేశారు. వారి వెంట ఈఈ రామచంద్రరావు, సెకోర్టియల్‌ అధికారి వెంకటయ్య, ఎంఈఓ చంద్రుడునాయక్‌, హెచ్‌ఎం రవీందర్‌ తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement