కందనూలు: రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారుబాబు అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మంగళవారం చేపట్టిన పాఠశాలల బంద్ జిల్లాకేంద్రంలో విజయవంతమైందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ నియంత్రణ, విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం చేపడుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో విద్యకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని విమర్శించారు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపును కచ్చితంగా అమలు చేయాలని కోరారు.


