రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం

Jun 23 2026 1:58 AM | Updated on Jun 23 2026 1:58 AM

అచ్చంపేట రూరల్‌: రాష్ట్రంలో రైతు సంక్షేమ పాలన సాగడం లేదని, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరొందుతుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం అచ్చంపేటలో నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం, సర్‌, సభ్యత్వ నమోదు ప్రత్యేక కార్యక్రమంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలోనూ కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని చిత్తుగా ఓడించామని, రాజకీయ సన్యాసం చేస్తానని ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి రాజకీయంలోనే కొనసాగుతున్నారన్నారు. నల్లమల బిడ్డను అని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో నీచమైన పనులు చేస్తున్నాడని, అబద్ధాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఆయన ఎనుముల రేవంత్‌రెడ్డి కాకుండా.. ఎగబెట్టే రేవంత్‌రెడ్డిగా మారాడన్నారు. రైతులనే కాదు దేవుళ్లకు సైతం ద్రోహం చేశాడని ఆరోపించారు. ప్రశ్నిస్తే పగబడుతున్నాడని, అక్రమ కేసులు నమోదు చేయించి మానసికంగా వేధిస్తున్నాడని విమర్శించారు. ఎస్‌బీఐని నిషేధించి రాష్ట్రంలో కొండల్‌రెడ్డి బ్యాంకు పెట్టేలా వ్యవహరిస్తున్నాడన్నారు. ప్రభుత్వంలోకి రాకముందు ఏడాదికి మూడుసార్లు రైతుబంధు ఇస్తానని రైతులను మోసం చేశాడన్నారు.

అచ్చంపేటలో నిర్వహించిన సమావేశానికి హాజరైన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

కొడంగల్‌లో గతంలోనూ ఓడించిన చరిత్ర బీఆర్‌ఎస్‌కు ఉంది

రాజకీయ సన్యాసం చేస్తానని మాట తప్పిన రేవంత్‌రెడ్డి

మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు

బోనస్‌ను బోగస్‌ చేశారు..

రైతులకు రైతుబంధు కింద సీఎం రేవంత్‌రెడ్డి రూ.29,358 కోట్లు బకాయి పడ్డారని, చిల్లర చేష్టలు చేస్తూ నల్లమల ప్రతిష్టను తగ్గిస్తున్నాడని హరీశ్‌రావు అన్నారు. అన్ని పంటలకు బోనస్‌ ఇస్తానని, బోనస్‌ను బోగస్‌ చేశాడన్నారు. మాటల్లోనే రైతు ప్రభుత్వం కనిపిస్తుందని, చేతల్లో లేదన్నారు. కేంద్రం కోటా కిందనే ధాన్యం కొంటాననడం సరికాదన్నారు. గతంలో కేంద్రం వరిధాన్యం కొనకపోవడంతో ఢిల్లీలో మాజీ సీఎం కేసీఆర్‌ ధర్నా చేసి వరిధాన్యం కొనేలా చేశారన్నారు. రాష్ట్రంలో 7,600 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా ఆగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఎవరికీ ఎలాంటి సాయం అందలేదన్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ఆ వర్గాలకు లబ్ధి చేకూరలేదని ఆరోపించారు. 700 మంది గౌడ కులస్తుకు ఎక్స్‌గ్రేషియా అందలేదన్నారు. రాష్ట్రంలో ఏ వర్గానికి మేలు జరగలేదని, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ఖజానాలో నిధులు ఉన్నా.. మనసు లేక పేద వర్గాలకు ఖర్చు పెట్టడం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశ పెడితే కేసీఆర్‌ కొనసాగించారని, ప్రస్తుత సీఎం పథకానికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నో కళాశాలలు మూత పడ్డాయన్నారు. స్కాముల ప్రభుత్వంగా మారిందని, తుగ్లక్‌ పాలనను తలపిస్తున్నాడని ఆరోపించారు. పాలమూరు ప్రాంతమని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. బీఆర్‌ఎస్‌ బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండి సర్‌ ప్రోగ్రాంలో చాకచక్యంగా, జాగ్రత్తగా పనిచేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కోరారు. రాజకీయ పార్టీలకు అచ్చంపేట బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దిక్సూచిగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మనోహర్‌, నర్సింహగౌడ్‌, మనోహర్‌ప్రసాద్‌, తులసీరాం, శ్రీకాంత్‌భీమా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement