కందనూలు/తాడూరు: మహిళా సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలు, మహిళా భవనాలు, ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి సంస్థల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మహిళ భరోసా కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు ఇందిరా మహిళా శక్తి భవనాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మహిళలకు రూ.2,500 చెల్లిచేందుకు ప్రభుత్వం చొరువ తీసుకుంటుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ప్రత్యేక పథకాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారానే వరి కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రూ.171 కోట్ల కమీషన్ మహిళా సంఘాలకు చెల్లించగా.. జిల్లాలో రూ.1.30 కోట్లు అందుతాయన్నారు. బాధితులకు కొండంత అండగా భరోసా కేంద్రం ఉంటుందని మంత్రి అన్నారు. కార్యక్రమంలో జోగులాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహన్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
రూ.20 కోట్లతో బ్రిడ్డి నిర్మాణం
తాడూరు మండలంలోని సిర్సవాడ వద్ద దుందభీ వాగుపై రూ.20 కోట్లు వ్యయంతో నిర్మించునున్న హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, అనిరుధ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ మాట్లాడుతూ.. వంతెన నిర్మాణం పూర్తయితే కేవలం రాకపోకలకే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి వారధిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఆర్ నిధులు రూ.30 కోట్లు, ఎమ్మార్ నిధుల నుంచి రూ.13 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.15 కోట్లు, వివిధ రహదారుల అభివృద్ధి పనులకు రూ.84 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దేవ సహాయం, అమరేందర్, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణ, సత్యారెడ్డి, ఇందిర, డీఆర్డీఏ చిన్న ఓబులేసు, సర్పంచ్ శ్రీదేవి, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక అబద్ధాలు
కందనూలు: కాంగ్రెస్ ప్రభుత్వం చే స్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నారు. సీఎంగా రేవంత్‌రెడ్డి కావడాన్ని బీఆర్‌ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, నల్లమల ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని, నల్లమల పౌరుషం, శౌర్యం రేవంత్‌రెడ్డి సొంతం అని మంత్రి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని విలేకరులతో ఆమె మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో పది లక్షల ఇళ్లు ఇవ్వలేక పోయిందని, కేవలం వాళ్ల దృష్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలనే ఆలోచనలో మాత్రమే ఉన్నారని ఆరోపించారు. అబద్ధానికి ఆరడుగుల అర్థం హరీశ్‌రావు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు కాంగ్రెస్, బీజేపీలకు కనబడడం లేదని, మేము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ పోతున్నామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి.. నెలకు రూ.4వేల కోట్లు వడ్డీ బకాయిలు పెట్టింది, కేసీఆర్ పాలనలో అభివృద్ధి కంటే అప్పులే పెరిగాయన్నారు. కేటీఆర్, హరీశ్‌రావులు కవిత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకుంటున్నారని.. రెండేళ్లలో రికార్డు స్థాయిలో పంటలు దిగుబడి వచ్చాయన్నారు.


