చారకొండ: మండలంలో చేపట్టే గోకారం జలాశయం సామర్థ్యం తగ్గించి, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని రద్దు చేయాలని నిర్వాసితులు ప్రకాష్, శ్రీరాములు, పెద్దయ్య డిమాండ్ చేశారు. ఎర్రవల్లి, ఎర్రవల్లితండాలను ముంపు నుంచి మినహాయించాలని కోరుతూ ఎర్రవల్లిలో చేపట్టిన నిరసన దీక్షలు ఆదివారం నాటికి 202 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ.. తమ సమస్య పరిష్కరించాలని పంచాయతీ ఎన్నికలు రద్దు చేసినా, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నేడు డయల్ యువర్ డీఎం
కొల్లాపూర్: కొల్లాపూర్ డిపో పరిధిలో ఆర్టీసీ రవాణాకు సంబంధించిన సమస్యలు, సలహాలు తెలిపేందుకు సోమవారం డయల్ యువర్ డీఎం నిర్వహించనున్నట్లు డీఎం మల్లేశయ్య వెల్లడించారు. ఆర్టీసీ ప్రయాణికులు సెల్ నంబర్ 94937 33602 కు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని కోరారు.
వాటాదారులకు మెరుగైన సేవలు
స్టేషన్ మహబూబ్‌నగర్: ది పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ వాటాదారులు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ కండె కుమారస్వామి అన్నారు. ది పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ 28వ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు. బ్యాంక్ చైర్మన్ కుమారస్వామి మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ రూ.1,29,68,995 లాభాలు ఆర్జించిందని చెప్పారు. ఇందులో వాటాదారులకు 25 శాతం డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించామని సీనియర్ వైస్ చైర్మన్ గుండ్ల కృష్ణయ్య ప్రకటించారు. తెలంగాణలో 25 శాతం డివిడెండ్ ఇస్తున్న ఏకై క కోఆపరేటివ్ బ్యాంక్ మనదేనని పేర్కొన్నారు. సీఓఈ రాచూరి రాజేంద్రకుమార్ 2025–26 సంవత్సరానికిగాను జమ అయిన ఖర్చుల వివరాలను సమావేశంలో వివరించగా సభ్యులందరూ ఆమోదం తెలిపారు. 28 ఏళ్ల తర్వాత బ్యాంక్ సొంత భవన నిర్మాణానికి స్థలం కొనుగోలు చేయనున్నామని, అలాగే 2026– 27 ఆర్థిక సంవత్సరంలో మరో నూతన శాఖను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు డైరెక్టర్లు వెల్లడించారు.
బీఎస్పీకి పూర్వవైభవం తేవాలి
వనపర్తిటౌన్: జిల్లాలో బీఎస్పీకి పూర్వ వైభవం తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్, పార్లమెంట్ ఇన్‌చార్జి గూడెం ఎల్లస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం వనపర్తిలో జిల్లా అధ్యక్షుడు మిద్దె మహేష్ అధ్యక్షతన బహుజన సమాజ్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరై వారు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పార్టీ కోసం కృషి చేయాలన్నారు. ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం జిల్లా కోశాధికారిగా దేవని శ్రీనివాసులు, జిల్లా ఈసీ మెంబర్‌గా కార్తీక్, మేకల ఆంజనేయులు యాద వ్‌ను అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా నియమించారు.
జూరాలకు నిలిచిన వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. స్థానికంగా కురిసిన వర్షాలతో 15 రోజులుగా స్వల్పంగా వస్తున్న ఇన్‌ఫ్లో ఆదివారం పూర్తి గా తగ్గింది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులతో పంపింగ్ చేస్తుండగా.. ఒక పంపును నిలిపేసి కేవలం ఒక పంపు ద్వారా నీటి పంపింగ్ చేస్తున్నట్లు పీజేపీ అధికారులు పేర్కొన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 749 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 41 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 569 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2 ద్వారా 873 క్యూసెక్కులు, ఇతర అవసరాలకు 537 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 740 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 2,951 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


