కందనూలు: ప్రతి నిత్యం యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. ఆంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో యోగా గురువు గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా అనేది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే ఒక ప్రాచీన భారతీయ కళ అన్నారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరుగుతుందని సూచించారు. అలాగే రోగనిరోధక శక్తి పెరిగి, దీర్ఘకాలిక వ్యాధులు, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల వంటి సమస్యలు రాకుండా యోగా ఎంతగానో సహాయపడుతుంది. కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీదేవి, జూనియర్ సివిల్ జడ్జి శృతిరూత దూత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్ రావు, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు.


