● ఉద్యోగాలు రెగ్యులరైజ్ అవుతాయనే ఆశజూపి రూ.లక్షల్లో వసూళ్లు
● నెలవారీ జీతభత్యాల్లో సైతం చేతివాటం
● ఫిర్యాదులు అందుతున్నాస్పందించనియంత్రాంగం
నిబంధనలకు విరుద్ధంగా ఔట్‌సోర్సింగ్ నియామకాలు
తాత్కాలికమే అయినప్పటికీ..
ప్రభుత్వ శాఖల్లో పనులను చక్కబెట్టేందుకు ప్రభుత్వం రెగ్యులర్ నియామకాల కన్నా తాత్కాలిక నియామకాలకే ఎక్కువగా మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలో ఔట్‌సోర్సింగ్ విధానంలో సిబ్బంది నియామకాన్ని ఏజెన్సీలకు అప్పగించడంతో పాటు సదరు సిబ్బంది జీతభత్యాలను సైతం ఏజెన్సీల ద్వారా చెల్లింపులు చేస్తోంది. స్వీపర్ స్థాయి ఉద్యోగాలకు రూ. 15,600, జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలకు రూ. 19,500, కొన్ని శాఖల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు రూ. 23వేల వరకు ప్రతినెలా చెల్లిస్తున్నారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నెలవారీ జీతభత్యాల్లో 4 శాతాన్ని సంబంధిత ఏజెన్సీలకు ప్రభుత్వం కమీషన్ రూపంలో చెల్లిస్తుంది. అయితే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు తాత్కాలికమే అయినప్పటికీ.. భవిష్యత్‌లో క్రమబద్ధీకరిస్తారనే ఆశచూపుతూ.. నియామకాల సందర్భంగా రూ. లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు.
జిల్లాలో 36 ఏజెన్సీలున్నా పెత్తనం కొందరిదే..
జిల్లావ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం 36 వరకు ఏజెన్సీ కంపెనీలు ఎంప్యానల్‌మెంట్‌లో నమోదై ఉన్నాయి. అయితే వీటిలో మూడు, నాలుగు ఏజెన్సీలే అన్ని శాఖల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నాయి. రాజకీయ నేతల అండదండలు, పైరవీలు నెరిపే ఏజెన్సీల పెత్తనమే కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉద్యోగుల నుంచి ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నా ఏజెన్సీలపై చర్యలు తీసుకోవడం లేదు.
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ శాఖల్లో వివిధ పనుల కోసం నియమించుకుంటున్న తాత్కాలిక ఉద్యోగుల నుంచి సంబంధిత ఏజెన్సీలు ఇష్టారీతిగా వసూళ్లు చేస్తూ, సొమ్ము చేసుకుంటున్నాయి. స్వీపర్ స్థాయి ఉద్యోగానికి సైతం రూ. 65వేల నుంచి రూ. 80వేల వరకు వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఔట్‌సోర్సింగ్ నియామక ప్రక్రియపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. ఏజెన్సీలదే ఇష్టారాజ్యంగా మారడంతో వసూళ్ల పర్వం క్రమంగా పెరుగుతోంది.
●
లంచం ఇస్తేనే జీతభత్యాలు..
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా జీతాలు రావడం లేదు. కనీసం మూడు, నాలుగు నెలలకు ఒకసారి ప్రభుత్వం నుంచి జీతభత్యాలు అందుతుండగా.. మరికొన్నిసార్లు ఉద్యోగులకు జీతం ఇవ్వకుండా ఏజెన్సీలు నిలిపేస్తున్నాయి. జిల్లాలోని మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రి, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధిత ఏజెన్సీలు సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వాలంటే సంబంధిత ఏజెన్సీకి అందులో కొంత మొత్తాన్ని ముట్టజెప్పాల్సి వస్తోందని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వాపోతున్నారు. లేనిచో మూడు నుంచి ఆరు నెలల వరకు జీతభత్యాలను పెండింగ్‌లోనే ఉంచుతున్నారని.. అందులోనూ కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడీ పీఎఫ్ డబ్బులను సైతం ఖాతాల్లో జమ చేయకుండా ఏజెన్సీలే సొమ్ముచేసుకుంటున్నాయని ఆందోళన చెందుతున్నారు.
ఎవరికీ డబ్బులు
ఇవ్వాల్సిన అవసరం లేదు
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. సంబంధిత శాఖ నుంచి నోటిఫికేషన్ ద్వారానే ఔట్‌సోర్సింగ్ విధానంలో ఎంపిక కొనసాగుతుంది. ఇందులో ఉద్యోగం కోసం ఏజెన్సీలకు డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరైనా డబ్బులు అడిగితే కలెక్టర్ లేదా సంబంధిత అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు.
– రాఘవేందర్ సింగ్,
జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి,


