● అందరి భాగస్వామ్యంతో ప్రగతి ప్రణాళికలు రూపొందించాలి
● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
కందనూలు: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ యాక్షన్ ప్లాన్ 2026–27 రూపకల్పనపై శుక్రవారం నాగర్‌కర్నూల్ మండలం గగ్గలపల్లి వద్దనున్న ఓ ఫంక్షన్‌హాల్‌లో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఎంపీఓలకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. గ్రామస్థాయిలో ప్రజల అభిప్రాయాలు, సూచనలు, అవసరాల ఆధారంగా రూపొందించే ప్రణాళికల ద్వారానే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతి జీపీలో గ్రామ సభలను విస్తృతంగా నిర్వహించి.. ప్రజల సమస్యలు, అవసరాలు, అభివృద్ధి ప్రతిపాదనలను సేకరించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు తమ విధులను ప్రభుత్వ నిబంధనల మేరకే నిర్వర్తించాలని.. ఎంపీడీఓలు నిబద్ధతతో వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, అంతర్గత రహదారులు, డ్రెయినేజీ వ్యవస్థ, వీధి దీపాలు, విద్యా సదుపాయాలు, ఆరోగ్య సేవలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పర్యావరణ పరిరక్షణ, వనమహోత్సవం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, మహిళా సాధికారత వంటి అంశాలకు జీపీడీపీలో ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్ స్పష్టంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను జీపీడీపీతో అనుసంధానం చేసి.. నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. జీపీడీపీ ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తిచేసి.. రూపొందించిన ప్రణాళికలను నాణ్యతతో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీపీఓ శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్ తదితరులు ఉన్నారు.
జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, భరోసా కేంద్రం నిర్మాణం కోసం కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని ప్రభుత్వ భూమిని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ప్రతిపాదిత స్థలంలోని భౌగోళిక పరిస్థితులు, రహదారి అనుసంధానం, భూమి విస్తీర్ణం వంటి అంశాలపై ఆరా తీశారు. భూమి సర్వే నంబర్లు, ప్రభుత్వ యాజమాన్య హక్కులు, మొత్తం భూమి విస్తీర్ణం, హద్దులు, సరిహద్దుల వివరాలను త్వరగా అందించాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, భరోసా కేంద్రం ఏర్పాటుతో పోలీసు సేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయని ఎస్పీ అభిప్రాయపడ్డారు. వారి వెంట అదనపు కలెక్టర్ అమరేందర్, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సురేశ్‌బాబు, డీఎఫ్‌ఓ రేవంత్ చంద్ర ఉన్నారు.


