అందుబాటులో 32వేల మె.ట. యూరియా | - | Sakshi
Sakshi News home page

అందుబాటులో 32వేల మె.ట. యూరియా

Jun 19 2026 12:54 AM | Updated on Jun 19 2026 12:54 AM

పారదర్శకంగా రైతులకు పంపిణీ

కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

కందనూలు: జిల్లాలో ప్రస్తుతం 32వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉందని.. రైతుల అవసరాలకు అనుగుణంగా సకాలంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి చేతులమీదుగా యూరియా బుకింగ్‌ యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం హాకా, ఆగ్రోస్‌, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, క్రిమిసంహారక మందుల విక్రయ కేంద్రాల డీలర్లతో యూరియా పంపిణీ, యాప్‌ ఆధారిత బుకింగ్‌ విధానం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా యూరియా పంపిణీ చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. యాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకున్న రైతులకు ప్రాధాన్యతనిస్తూ.. వారికి ఎరువులు సులభంగా అందే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు యాప్‌ వినియోగంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు వ్యవసాయశాఖ అధికారులు, డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అమరేందర్‌, డీఏఓ యశ్వంత్‌రావు, జిల్లా సహకార అధికారి రఘునాథ్‌రావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు అశోక్‌, హర్షవర్ధన్‌ ఉన్నారు.

జిల్లా జనరల్‌ ఆస్పత్రిని అన్నివిధాలుగా అభివృద్ధిచేసే దిశగా చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ వీసీ హాల్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా జనరల్‌ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమీక్షలో ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలు, ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాల అవసరాలు, భవిష్యత్‌ అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా ఆస్పత్రి ప్రస్తుత పరిస్థితి, రోగుల రద్దీ, అందుబాటులో ఉన్న వైద్యసేవలు, వివిధ విభాగాల్లో అవసరమైన ఆధునిక పరికరాల ఏర్పాట్లపై కమిటీ కన్వీనర్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.ఉషారాణి పూర్తిస్థాయి వివరాలను కమిటీకి వివరించారు. జిల్లా ఆస్పత్రిలో ఆధునిక వైద్యసేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 2.68కోట్లు మంజూరు చేసిందని.. ఈ నిధులతో ఆస్పత్రికి అత్యవసర పరికరాలను కొనుగోలు చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇందుకు ప్రతి విభాగం నుంచి అవసరాల జాబితాను సేకరించి, సాంకేతిక నివేదికలతో కూడిన సమగ్ర ప్రతిపాదనలను అత్యవసరంగా సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ తీగల సునేంద్ర, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మహమ్మద్‌ దావూద్‌ సులేమాన్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement