●
పాఠశాల విద్యాశాఖ నుంచి దుస్తుల రంగులు, డిజైన్లకు సంబంధించి ఉత్తర్వులు అందాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ నూతన యూనిఫాంలను వచ్చే నెలలో పంపిణీ చేస్తాం. వారం రోజుల్లోగా ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు కొత్త యూనిఫాంలకు సంబంధించిన క్లాత్‌ను అందించనున్నాం. ఇప్పటికే ఆయా పాఠశాలలకు పుస్తకాలు చేరడంతో పంపిణీ చేస్తున్నారు. – రమేశ్‌కుమార్, డీఈఓ
అచ్చంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించనున్న యూనిఫామ్ డిజైన్‌లో మార్పు చేశారు. 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ నీలిరంగు దుస్తులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు క్లాత్‌ను జిల్లాకు సరఫరా చేసింది. జిల్లాలో ప్రభుత్వ, యూపీఎస్, పీఎస్, కేజీబీవీ, జెడ్పీ, ఎయిడెడ్, యూఆర్‌ఎస్, టీఎస్‌ఆర్‌ఈఐఎస్, మోడల్ స్కూళ్లు మొత్తం 839 ఉండగా.. 58,455 మంది బాలబాలికలు చదువుతున్నారు. వారందరికీ కొత్త దుస్తులు అందితే.. పాఠశాలలు సరికొత్త శోభను సంతరించుకోనున్నాయి. సమగ్ర శిక్ష, సెర్ప్, మెప్మా సమన్వయంతో యూనిఫాంల తయారీ, పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు సంబంధిత అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. త్వరలోనే పాఠశాలల వారీగా విద్యార్థుల కొలతలు తీసుకునే అవకాశం ఉంది.
రెండేసి జతల చొప్పున..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండేసి జతల యూనిఫాం అందిస్తారు. ఇప్పటికే జిల్లాకు ఏకరూప దుస్తులకు సంబంధించిన వస్త్రం చేరింది. స్వయం సహాయక సంఘాల సభ్యులతో కుట్టించి.. పంపిణీ చేయనున్నారు. మరోనెల లేదా రెండు నెలల వరకు పాత దుస్తులతోనే విద్యార్థులు బడులకు రావాల్సి ఉంటుంది. గతేడాది సుమారు 56,733 మంది విద్యార్థులకు యూనిఫాంలను అందజేశారు. ఈసారి బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల సంఖ్య పెరగనున్నందున సుమారు 60వేలకు పైగా మంది విద్యార్థులకు అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
సర్కారు బడుల విద్యార్థుల యూనిఫాం డిజైన్ మార్పు
జిల్లాకు చేరిన క్లాత్
మహిళా సంఘాల సభ్యులకు
కుట్టే బాధ్యత
60వేల మంది బాలబాలికలకు
అందనున్న కొత్త దుస్తులు


