విత్తనాల ఎంపికలో జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

విత్తనాల ఎంపికలో జాగ్రత్త

Jun 18 2026 1:17 AM | Updated on Jun 18 2026 1:17 AM

ఎల్‌నినో ప్రభావం అంతంతమాత్రమే

పూర్తిస్థాయిలో వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలి

ముందే విత్తితే నష్టం తప్పదు

‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్‌రావు

కందనూలు: ‘‘రైతులు ఎల్‌నినోపై బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు.. దాన్ని ప్రభావం తాత్కాలికమే. ముఖ్యంగా విత్తనాల ఎంపికలో రైతులు జాగ్రత్తలు పాటించాలి. జిల్లాలోని లైసెన్స్‌డ్‌ విత్తన షాపుల్లో మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలి’’ అని జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్‌రావు సూచించారు. విత్తనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని.. అందులో సంబంధిత విత్తన లాట్‌ నంబర్‌ను నమోదు చేయించుకోవాలన్నారు. వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతుల ఇబ్బందులపై బుధవారం ‘సాక్షి‘ నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా రైతులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానమిచ్చారు. విత్తనాల ఎంపిక, పంటల సాగులో మెళకువలు, నాసిరకం విత్తనాల కట్టడికి తాము తీసుకుంటున్న చర్యలను రైతులకు వివరించారు.

ప్రశ్న: నకిలీ విత్తనాలను అరికట్టడం ఎలా?

– లక్ష్మణ్‌, కార్వంగ..

శివాజీ గణేశ్‌, గౌరారం

డీఏఓ: ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ పొందిన డీలర్ల వద్దే విత్తనాలు తీసుకోవాలి. అందుకు సంబంధించిన బిల్లు తప్పనిసరిగా పొంది.. పంట దిగుబడి వచ్చేవరకు దాచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ లూజ్‌ విత్తనాలను కొనుగోలు చేయొద్దు. తొమ్మిది ఇంచుల లోతు భూమి తడిసిన తర్వాతే విత్తనాలు విత్తాలి.

ప్రశ్న: యూరియా యాప్‌ను రద్దు చేయండి.

– సైదులు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు

డీఏఓ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌ను రద్దు చేయడానికి అవకాశం లేదు. రైతులకు నష్టం జరగకూడదని ప్రవేశపెట్టారు. అందుకోసం ప్రతి ఏఓ వద్ద వలంటీర్‌ను ఏర్పాటుచేశాం. రైతుల వద్ద స్మార్ట్‌ ఫోన్‌ లేకపోతే ఏఈఓలను సంప్రదిస్తే వాళ్లు యూరియాను బుక్‌ చేస్తారు. కాబట్టి దీన్ని ద్వారా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగదు.

ప్రశ్న: యూరియా యాప్‌ చాలా కష్టంగా ఉంది. ప్రత్యామ్నాయం ఆలోచించండి.

– ప్రవీణ్‌, వెల్దండ

డీఏఓ: యూరియాను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించకుండా యాప్‌ తీసుకురావడం జరిగింది. యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌తో నిజమైన రైతులకు న్యాయం జరుగుతుంది. ఈ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. రోజు ఉదయం 6నుంచి మధ్యాహ్నం 2గంటల సమయంలో బుక్‌ చేసుకోవచ్చు. యాప్‌ను ఉపయోగించే విధానంపై ఏఈఓలను సంప్రదించండి.

ప్రశ్న: వరిలో ఏరకం సాగుచేయాలి.. ఏది లాభదాయకం?

– రామకృష్ణ, కంసానిపల్లి, ఉప్పునుంతల

డీఏఓ: ప్రభుత్వం సన్నరకాలను ప్రోత్సహిస్తోంది. నీటి సదుపాయం ఉండి, భూమిలో చౌడు లేకుంటే సన్నాలను సాగుచేయాలి. సన్నరకంలో బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్‌–1508, ఎన్‌ఎం–1638 వడ్లను సాగుచేసుకోవాలి. తద్వారా మంచిరేటు, దిగుబడి ఉంటుంది.

ప్రశ్న: ప్రభుత్వం అందించే బోనస్‌ కోసం ఏరకమైన సన్నాలను సాగుచేయాలి?

– చందు, కంసానిపల్లి, ఉప్పునుంతల

డీఏఓ: ప్రభుత్వం పంపిణీచేసే సన్నబియ్యం కోసం 33 రకాలకు బోనస్‌ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. వడ్లతో పాటు ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

ప్రశ్న: పచ్చిమిరప ఏ సమయంలో వేసుకోవాలి?

– రేణయ్య, గువ్వలోనిపల్లి, ఉప్పునుంతల

డీఏఓ: పచ్చిమిరిచి వేసే సమయంలో పొలంలో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. జూన్‌ మొదటి వారం నుంచి జూలై మొదటి వారం వరకు విత్తుకోవాలి. తగిన జాగ్రత్తలు పాటించినట్‌లైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ప్రశ్న: గత యాసంగిలో మొక్కజొన్న ఎక్కువ వేయడంతో ఇబ్బందులు తలెత్తాయి.. సరైన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.

– రవీందర్‌రావు, పెద్దాపూర్‌, ఉప్పునుంతల

డీఏఓ: మార్క్‌ఫెడ్‌ ద్వారా జిల్లాలో 16 కేంద్రాలను ఏర్పాటుచేశాం. మొక్కజొన్న దిగుబడి ఎక్కువ రావడంతో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాం. అందరు ఒకటే పంట వేయకుండా ప్రత్యామ్నాయం ఆలోచించాలి.

ప్రశ్న: పత్తిలో ముడత నివారణకు మార్గాలు తెలియజేయండి?

– శ్రీనివాసులు, గౌరారం, తెలకపల్లి

డీఏఓ: పత్తిలో ముడత నివారణ పోవాలంటే మొలక శాతం సరిగ్గా ఉండాలి. తేమ తగినంత ఉండాలి. కోళ్ల ఎరువు వేసుకోవడం ద్వారా పొలంలో వేడి ఎక్కువగా ఉండి ముడత తెగులు వచ్చే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావంతో తేమ సరిగ్గా ఉండదు. రైతులు ఎరువులను వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

ప్రశ్న: వర్షాకాలంలో వరి తెగులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

– లవకుమార్‌, పాపగల్‌, తాడూర్‌

డీఏఓ: వరి తెగులు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం అనుమంతించిన రకాలు వేసుకోవాలి. ఆర్‌ఎన్‌ఆర్‌–1508, కేఎన్‌ఎం 1638, రకాల వడ్లను వేసుకోవాలి. తద్వారా తెగుళ్లను నివారించవచ్చు. వాటికి తోడు వరి మాత్రమే కాకుండా కందులు, మినుములు, ఇతర రకాల ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement