నేడు లక్కీ డ్రా | - | Sakshi
Sakshi News home page

నేడు లక్కీ డ్రా

Jun 18 2026 1:17 AM | Updated on Jun 18 2026 1:17 AM

కందనూలు: జిల్లాలోని బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతిలో ఎస్సీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు గాను గురువారం లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఉమాపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో ఉదయం 10 గంటలకు డ్రా తీయడం జరుగుతుందని.. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకావాలని ఆయన సూచించారు.

బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు

కల్వకుర్తి రూరల్‌: బాలలను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ అల్తాఫ్‌ హెచ్చరించారు. బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కల్వకుర్తి పట్టణంలోని పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ పాల కేంద్రంలో పనిచేస్తున్న 15 ఏళ్ల బాలుడికి విముక్తి కల్పించి.. జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఎదుట హాజరుపరిచారు. బడీడు పిల్లలు పాఠశాలకు వెళ్లాలని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కార్యక్రమంలో చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ అధికారులు మధుబాబు, శంకర్‌, పద్మ, వెంకటస్వామి, యాదగిరి పాల్గొన్నారు.

వైద్యసేవల్లో ఆర్‌ఎంపీల పాత్ర కీలకం

అచ్చంపేట: మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో ఆర్‌ఎంపీలు కీలక పాత్ర పోషిస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేటలోని రెడ్డి భవన్‌లో బుధవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి ఆర్‌ఎంపీల అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. వైద్యాన్ని వ్యాపారంగా కాకుండా, సేవాభావంగా భావించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యసేవల విస్తరణకు కృషి చేస్తున్నామని.. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. వైద్యరంగ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు గోవర్ధన్‌రెడ్డి, విష్ణుమూర్తి పాల్గొన్నారు.

పెరిగిన ఉల్లి ధర

దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధర మరింత పెరిగింది. వివిధ గ్రామాల నుంచి దాదాపు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి రాగా.. వ్యాపారులు వేలం వేసి ధరలు నిర్ణయించారు. వేలంలో క్వింటాల్‌ ఉల్లి గరిష్టంగా రూ.2,110, కనిష్టంగా రూ.1,200 వరకు ధరలు లభించాయి. అలాగే 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.1,100, కనిష్టంగా రూ.600 వరకు విక్రయించారు. మార్కెట్‌లో కేవలం ఉల్లి వ్యాపారం మాత్రమే కొనసాగింది.

‘వైద్య ఉద్యోగుల సామాజిక భద్రత ప్రభుత్వానిదే’

ఖిల్లాఘనపురం: వైద్య ఉద్యోగుల సామాజిక భద్రత ప్రభుత్వాలదేనని తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఉమ్మడి జిల్లా కోశాధికారి భాస్కర్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం దగ్గర తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ అనుబంధం) 12వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి వైద్యాధికారి డా. మాధవి జెండా ఆవిష్కరించగా.. ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని.. వారి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యసిబ్బంది డా. సందేశ్‌, వెంకటలక్ష్మి, ప్రభావతి, వెంక టేష్‌, భీమయ్య, మునీందర్‌, నజ్మా, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement