కేసీఆర్ వస్తేనే పాలమూరుకు నీళ్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘పాలమూరు అభివృద్ధి చెందాలంటే మళ్లీ కేసీఆరే రావాలి. ఐటీ హబ్ పునర్ వైభవం పొందాలంటే, ఉద్యోగాలు రావాలంటే, అమర్ రాజా కంపెనీ మళ్లీ రావాలన్నా, రైతులు, మహిళల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నా, భూముల ధరలు పెరగాలన్నా మళ్లీ కేసీఆర్ రావాలి’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో ఎస్‌వీఎస్ మెడికల్ కళాశాల నుంచి ఎంబీసీ మైదానం వరకు బీఆర్‌ఎస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎంబీసీ మైదానం నిర్వహించిన బీఆర్‌ఎస్ నూతన సర్పంచులు, ఉపసర్పంచుల సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొడంగల్‌తో సహా 14 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని చెప్పారు. అభ్యర్థిగా ఎవరున్నా గులాబీ జెండాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
పల్లె, పట్టణం తేడా లేకుండా అభివృద్ధి..
బీఆర్‌ఎస్ హయాంలో పల్లె, పట్టణం తేడా లేకుండా అభివృద్ధి చేశామన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా సమాంతరంగా అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. తాను మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మహబూబ్‌నగర్‌తో పాటు వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల మున్సిపాలిటీల్లో చేసిన అభివృద్ధిని గమనించాలని కోరారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రి, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, ఫైఓవర్ల నిర్మాణం, వీధి వ్యాపారుల దుకాణాలను చూశాక తనకు కడుపు నిండిందని వ్యాఖ్యానించారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్లు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలతో పనులన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రెండేళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు.
మైగ్రేషన్ జిల్లా కాదు.. ఇరిగేషన్‌కు మారుపేరుగా మార్చాం
పెండింగ్ ప్రాజెక్టులను
రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే
పాలమూరు బిడ్డనంటూ రేవంత్ గద్దెనెక్కారు
రెండేళ్లయినా ఒక్క పనీ చేయలేదు
పాలమూరు నుంచే మున్సిపల్ ఎన్నికల జైత్రయాత్ర
మహబూబ్‌నగర్‌లో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మైగ్రేషన్ జిల్లాను ఇరిగేషన్ జిల్లాగా మార్చాం..
వలసలకు మారుపేరుగా ఉన్న పాలమూరు జిల్లాను బీఆర్‌ఎస్ హయాంలో ఇరిగేషన్ జిల్లాగా మార్చామని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు రిజర్వాయర్లతో సహా 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని చెప్పారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. పాలమూరులోని ఐటీ హబ్‌లో ఏర్పాటైన 14 పరిశ్రమలు ఎందుకు పారిపోయాయని ప్రశ్నించారు.


