ప్రజావాణికి 29 ఫిర్యాదులు
నాగర్‌కర్నూల్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి 29 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్‌లో ఉన్న అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు గ్రీవెన్స్‌కు 8..
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు గ్రీవెన్స్‌కు వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషిచేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీసు ప్రజావాణికి 8 ఫిర్యాదులు రాగా.. ఇందులో 4 కుటుంబ తగాదా, 4 తగు న్యాయం చేయాలని ఫిర్యాదులు ఉన్నాయన్నారు. జిల్లా ప్రజలు నిర్భయంగా పోలీసు ప్రజావాణికి వచ్చి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.
జోగుళాంబ బ్రహ్మోత్సవాలకు
సీఎంకు ఆహ్వానం
అలంపూర్: జోగుళాంబదేవి వార్శిక బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించినట్లు ఈఓ దీప్తి తెలిపారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసినట్లు చెప్పారు. ఈ నెల 19 నుంచి 23 వరకు జోగుళాంబ ఆలయంలో వార్శిక బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వచ్చేనెల 14 నుంచి 18 వరకు బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
28 నుంచి
మన్యంకొండ జాతర
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఈనెల 28 నుంచి మార్చి 5 వరకు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలపై సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సన్నాహ క సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన తాగునీరు, శానిటేషన్, టాయిలెట్లు, బందోబస్తు రద్దీ నియంత్రణ వంటి సౌకర్యాలను కల్పించాలన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ముఖ్య శాఖల అధికారులతో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ప్రతి శాఖ నుంచి ఒక అధికారిని నియమించి ఏర్పాట్ల పర్యవేక్షణ చేయాలని సూచించారు.
ప్రజావాణికి 29 ఫిర్యాదులు


