విద్యాభివృద్ధితోనే పేదరిక నిర్మూలన
వంగూరు: పేదరిక నిర్మూలన జరగాలంటే ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందాలని, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని పోల్కంపల్లి గ్రామానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులకు వారు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు ఈ ప్రాంత ప్రజలకు వరం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత మండలం కావడంతో పైలెట్ ప్రాజెక్టు కింద వంగూరు, పోల్కంపల్లి గ్రామాలను ఎంపిక చేసుకుని రూ.25 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 105 సమీకృత విద్యా భవనాలను మంజూరు చేశామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాల కంటే నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి టీపీఎస్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్రంలో 4 పాఠశాలలను మంజూరు చేశారని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయన్నారు. విద్య, వైద్యం, ఇరిగేషన్, ఇండస్ట్రీయల్ పరంగా రాష్ట్రం అభివృద్ధి చెందితే అన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేందర్, సర్పంచ్ నారమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం
నాగర్‌కర్నూల్: ఆర్థిక ప్రగతితోపాటు ప్రజల సంక్షేమాన్ని సాధించాలంటే బ్యాంకర్ల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఎంపీ మల్లు రవి అన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఎంపీ అధ్యక్షతన నిర్వహించిన బ్యాంకర్ల జిల్లాస్థాయి సమావేశంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
● ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ప్రతినెలా 30, 31న సివిల్ రైట్స్ నిర్వహించాలని ఎంపీ మల్లురవి సూచించారు. అన్ని సంక్షేమ పథకాలలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
● కుల వ్యవస్థ మూలంగా ఏర్పడిన సామాజిక విభేదాలను తొలగించడమే లక్ష్యం అని ఎంపీ మల్లు రవి అన్నారు. కులాంతర వివాహం చేసుకున్న 5 జంటలకు కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో చెక్కులు అందజేశారు.


