వేగవంతంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం
నాగర్‌కర్నూల్: జిల్లాకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల స్థల సేకరణ, నిర్మాణాలపై సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. ఈ సమావేశానికి హాజరైన కలెక్టర్ వివరిస్తూ జిల్లాలోని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేటలకు మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాలకు కావాల్సిన స్థల సేకరణ పూర్తిచేసి నిర్మాణ సంస్థలకు అప్పగించామన్నారు. కొల్లాపూర్‌కు సంబంధించి పాఠశాల జట్రపోల్‌లో నిర్మాణ దశలో ఉందని, నాగర్‌కర్నూల్ పాఠశాల తూడుకుర్తి గ్రామంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, అచ్చంపేట పాఠశాల ఉప్పునుంతల మండలంలో స్థలానికి కేటాయించామని వివరించారు. పనులు వేగవంతంగా నాణ్యతగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు
పకడ్బందీ ఏర్పాట్లు
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సెక్రెటరియేట్ నుంచి రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి టీకే శ్రీదేవితో కలిసి కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలైన నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి పరిధిలోని 65 వార్డుల్లో సోమవారం ఓటర్ల తుది జాబితా విడుదల చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వారిగా ఈ నెల 16న ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్నారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై జిల్లా యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉందని వెల్లడించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ దేవసహాయం తదితరులు పాల్గొన్నారు.


