మహిళలే కీలకం..!
పురుషులతో పోలిస్తే 10,891 మంది అధికం
● పురపాలికల్లో తేలిన ఓటర్ల లెక్క
● ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో వెల్లడి
● జడ్చర్ల, అచ్చంపేటకు పూర్తి కాని
పదవీ కాలం
● ఉమ్మడి జిల్లాలో పట్టణ ఓటర్లు 6,18,604 మంది
● పలు మున్సిపాలిటీల్లో పరిష్కారం కాని
అభ్యంతరాలు?
పరిష్కారం చూపించలేదంటూ విమర్శలు..
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇంటి నంబర్ల ప్రకారం ఓటు హక్కు కల్పించలేదని.. ఇతర వార్డుల్లో ఓట్లు నమోదయ్యాయని.. వేరే జిల్లాలు, గ్రామాలు, ఇతర ప్రాంతాల ఓటర్లు తమ వార్డుల్లో నమోదైనట్లు వందలాది మంది ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల పదో తేదీనే తుది ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉండగా.. మరో రెండు రోజులు పొడిగించారు. ఈ మేరకు సోమవారం అధికారులు ఫైనల్ ఓటర్ల జాబితాను వెల్లడించగా.. ఇందులోనూ పలు అభ్యంతరాలకు పరిష్కారం చూపలేదని రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ప్రధానంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్, అయిజ, పెబ్బేరు, అమరచింత, మద్దూరు పురపాలికల్లో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదులు పరిష్కరించి.. తుది జాబితాను వెల్లడించినట్లు చెబుతున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పురపాలికల ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పదవీ కాలం పూర్తి కాని జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మరో 18 పురపాలికలకు సంబంధించి సోమవారం తుది ఓటర్ల జాబితాను ఖరారు చేశారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల జయాపజయాల్లో వారి కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.
మహిళలే కీలకం..!


