గురుకులం..పిలుస్తోంది
కందనూలు: గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026–27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అదే విధంగా ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు గురుకులాల్లో చేరవచ్చు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి.. అత్యుత్తమ బోధన, పోటీ పరీక్షలపై ఉచిత శిక్షణ, నాణ్యమైన భోజనం, అవసరమయ్యే నోట్‌పుస్తకాలు నుంచి క్రీడా పరికరాల వరకు ఉచితంగా అందిస్తున్న గురుకులాలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంలాంటివని చెప్పవచ్చు.
అత్యుత్తమ బోధన..
జిల్లాలోని 10 ఎస్సీ సంక్షేమ గురుకులాల్లో 4,800 మంది, నాలుగు గిరిజన సంక్షేమ గురుకులాల్లో 1,920 మంది, ఏడు బీసీ సంక్షేమ గురుకులాల్లో 3,360 మంది, నాలుగు మైనార్టీ గురుకులాల్లో 1,920 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందిస్తున్నారు. తొమ్మిదో తరగతి స్థాయిలో నీట్, ఐఐటీ, క్లాట్, ఎఫ్‌సెట్, ఎన్‌ఐటీ తదితర పోటీలకు ఫౌండేషన్ శిక్షణ అందిస్తున్నారు. జాతీయస్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ, ఎంబీబీఎస్, బీడీఎస్, తదితర యూనివర్సిటీలకు సంబంధించిన ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నారు. గురుకులాల ఆధ్వర్యంలో నిర్వహించే సైనిక్ స్కూల్‌లో చేరేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ త్రివిధ దళాల్లో చేరేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
క్రీడలు, పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి..
గురుకుల విద్యార్థులకు క్రీడలతో పాటు ప్రత్యేకంగా ఆహార నియమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. విద్యార్థులకు క్రీడల్లో శిక్షణనిస్తూ.. ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగా, ఫైన్ ఆర్ట్స్ తదితర అంశాల్లో తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడా పోటీల్లో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. నోట్ పుస్తకాలు, యూనిఫాం, ట్రంకు బాక్స్, స్పోర్ట్స్ డ్రెస్‌లు, ప్లేట్, గ్లాస్, బెడ్‌షిట్లు, సాక్సులు ఉచితంగా అందజేస్తున్నారు. కాస్మోటిక్ చార్జీలు ప్రతినెలా ఒక్కో విద్యార్థికి రూ. 220 చొప్పున చెల్లిస్తున్నారు.
21లోగా దరఖాస్తు చేసుకోవాలి..
గురుకులాల్లో చేరే విద్యార్థులు అడ్మిషన్ కోసం ఈ నెల 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుదారులకు ఫిబ్రవరి 22న ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ఐదో తరగతిలో ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ
ఫిబ్రవరి 22న ఉమ్మడి ప్రవేశ పరీక్ష
గురుకులం..పిలుస్తోంది


