వసూళ్లలో తగ్గిన దూకుడు
ప్రత్యేక కార్యాచరణ..
● లక్ష్యం చేరుకోవడంలో వెనకబడిన ఉమ్మడి జిల్లా ఆర్టీఏ శాఖ
● జీవితకాల ఫీజు, త్రైమాసిక పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం
● సిబ్బంది కొరతతో
నామమాత్రంగా తనిఖీలు
● మూడు నెలల్లో ముగియనున్న
ఆర్థిక సంవత్సరం
2025–26లో కేటాయించిన లక్ష్యంలో
డిసెంబర్ 31 వరకు చేరుకున్నది ఇలా.. (రూ.కోట్లలో..)
పాలమూరు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆర్టీఏ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో మూడు నెలల గడువు ఉన్న క్రమంలో అప్పటి వరకు ఇచ్చిన లక్ష్యం కంటే అధిక మొత్తంలో పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో వాహనాలకు జరిమానాలు, అధిక లోడ్, పత్రాలు లేకుండా, డ్రైవర్‌కు లైసెన్స్ లేకుండా తిరిగే వాహనాలకు జరిమానాలు విధించడానికి తనిఖీలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. జిల్లా ఆర్టీఏ శాఖ జీవిత కాల పన్నుతోపాటు ఫీజుల వసూలులోనూ పూర్తిగా వెనుకబడి ఉంది. ప్రధానంగా త్రైమాసిక పన్నులు అయితే పూర్తిగా తగ్గిపోవడంతో సమస్యగా మారింది. దీంతోపాటు తనిఖీల వల్ల వచ్చిన ఆదాయం కూడా తగ్గింది. ప్రతిరోజు తనిఖీలు చేయాలని లక్ష్యం ఉన్నా.. సిబ్బంది కొరత వల్ల అది సాధ్యం కావడం లేదు. అరకొరగా ఉన్న అధికారులు రోడ్ల మీద వాహన తనిఖీలకు వెళ్తే కా ర్యాలయంలో పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.
అధిక లోడ్.. పత్రాలు..
జిల్లాలో జాతీయ రహదారి–44 ఉండటంతో అధిక లోడ్ కలిగిన వాహనాలు అధిక సంఖ్యలో వెళ్తుంటాయి.. అలాంటి వాహనాలపై ఆర్టీఏ శాఖ కొరడా ఝులిపిస్తుంది. అదేవిధంగా పత్రాలు లేకుండా కూడా అధిక సంఖ్యలో వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో వాటిపై కూడా పన్నులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాహనాల కోసం ఆర్టీఏ శాఖ వారు జాతీయ రహదారిపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు పత్రాలు లేకుండా అధిక మొత్తంలో పన్నులు వసూలు చేయడం జరుగుతుంది. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి సర్వీస్ ఫీజు, డిటెక్షన్, గ్రీన్‌ట్యాక్స్ వసూలులో లక్ష్యానికి మించి సాధించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో వసూలు చేసిన పన్నుల వివరాలు
పన్ను రకాలు లక్ష్యం వసూలు చేసింది శాతం
(రూ.లక్షల్లో..)
మూడునెలల పన్ను 1,735.01 1,639.03 94.46
జీవితకాల పన్ను 5,301.00 4,230.19 79.79
ఫీజులు 990.00 798.84 80.69
సర్వీస్ ఫీజు 243.00 295.46 121
డిటెక్షన్ 207.00 338.68 163
గ్రీన్‌ట్యాక్స్ 117.00 119.28 101
జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి ప్రత్యేక కార్యాచరణతో వెళ్తున్నాం. ప్రత్యేక టీంల ద్వారా ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు చేసి ఆదాయం పెరిగే విధంగా చూస్తాం. జీవిత కాల బీమా, నూతన వాహనాల ట్యాక్స్ ఇతర ఆదాయ మార్గాల్లో లక్ష్యం పూర్తి చేస్తాం. మరో మూడు నెలల గడువు ఉన్న నేపథ్యంలో అన్ని రకాల వాహనాల ధ్రువపత్రాలపై తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తాం. – రఘుకుమార్,
ఆర్టీఓ, మహబూబ్‌నగర్


