కార్మికులకు న్యాయం చేసేదాక పోరాటం
వెల్దండ: కార్మికులకు న్యాయం చేసే వరకు వారి తరపున పోరాటం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు అన్నారు. శనివారం వెల్దండలో కార్మిక కర్షక పోరుయాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా అధికారంలో ఉండి అదాని, అంబానీ వంటి పెట్టుబడిదారులకు రూ.లక్షల కోట్లు ప్రజల సంపదను దోచిపెట్టిందని ఆరోపించారు. కార్మికులకు నష్టం కలిగే విధంగా 29 చట్టాలను తీసుకువచ్చి కార్మికులకు అన్యాయం చేస్తుందన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తుందని దుయ్యబట్టారు. మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తూ దాని స్థానంలో జీరాంజీ పథకం తీసుకొచ్చి వందరోజుల పనికి వ్యవసాయ కార్మికులను దూరం చేసేందుకు కుట్ర పన్నిందని విమర్శించారు. వీటిని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న నాగర్‌కర్నూల్ జిల్లాలో నిర్వహించే బహిరంగ సభకు అధిక సంఖ్యలో కార్మికులు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌రెడ్డి, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాసమ్మ, భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, ఆయా సంఘాల నాయకులు ఆంజనేయులు, వెంకటేష్, శ్రీనివాసులు, లక్పతి, శివలీల, మెర్లీన్, స్వప్న, తిరుపతయ్య, యాదయ్య, ప్రభాకర్, రాజుగౌడు తదితరులు పాల్గొన్నారు.


