బంగారం వంటి భూములు.. బీడుగా వదిలేశారు!
రాష్ట్రంలో రెండో యాదాద్రిగా పేరుగాంచిన, కొల్లాపూర్ సురభి రాజవంశస్తుల కులదైవమైన సింగోటం లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి 264 ఎకరాల మాన్యం భూమి ఉంది. మాచినేనిపల్లి, సింగోటం గ్రామాల శివార్లలో ఉన్న ఈ భూమిని కౌలుకు ఇచ్చి.. దాంతో వచ్చే ఆదాయాన్ని ఆలయ నిర్వహణ ఖర్చులకు వినియోగించేవారు. అయితే రెండున్నర దశాబ్దాల క్రితం కౌలు పునరుద్ధరణ విషయంలో ఆలయ కమిటీ, రైతులకు మధ్య వివాదం నెలకొనడంతో కౌలు వేలం నిలిపివేశారు. నాటి నుంచి మాన్యం భూములు సాగుకు నోచుకోవడం లేదు. ఆలయ అర్చకుల ఆధీనంలో ఉన్న 18 ఎకరాల భూమి మినహాయిస్తే మిగతాదంతా కంపచెట్లు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. మాన్యం భూమిని కౌలుకు ఇస్తే వాటిని సాగు చేసునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ, ఆనాటి ఘటనతో కినుక వహించిన అధికారులు నేటికీ భూములను సాగులోకి తీసుకువచ్చే ప్రయత్నం మాత్రం చేయ డం లేదు. అలాగే కొల్లాపూర్‌లోని రామాలయానికి ఎల్లూరు, గడ్డబస్వాపూర్ గ్రామంలో 12 ఎకరాలు, కొండూరులో 84 ఎకరాలు, బండాయిగుట్ట వేంకటేశ్వరస్వామి ఆలయానికి బెక్కెం గ్రామంలో 11 ఎకరాల మాన్యం భూములు ఉండగా.. వీటికి కూడా కౌలు పంచాయితీలు నెలకొన్నాయి.
ఆక్రమణలో మరిన్ని ఆలయాల భూములు
జిల్లాలోని పలు ఆలయాలకు చెందిన మాన్యం భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. మాన్యం భూములపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గంలోని సిర్సనగండ్ల రామాలయానికి 1,400 ఎకరాలకు పైగా మాన్యం భూములు ఉండగా.. వీటిలో కొంతమేర స్థానికులు ఆక్రమించుకుని పంటలు సాగు చేసుకుంటున్నారు. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలోని చెన్నకేశవస్వామి ఆలయానికి 300 ఎకరాలు, ఆంజనేయస్వామి ఆలయానికి 250 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిలో కూడా కొంతమేర ఆక్రమణలకు గురైంది. కొల్లాపూర్‌లోని రామాలయానికి చెందిన కొండూరు గ్రామంలో మాన్యం భూమి చాలావరకు ఆక్రమణకు గురైంది. దేవాదాయ శాఖ అధికారుల అలసత్వం కారణంగానే రూ.కోట్ల విలువ చేసే భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించకుంటే మాన్యం భూములు భవిష్యత్‌లో రికార్డుల్లో మాత్రమే కనిపించే పరిస్థితులు నెలకొన్నాయి.
చెంతనే పారుతున్న సాగునీరు.. వందల ఎకరాల భూములు ఉంటే ఎవరైనా ఏం చేస్తారు.. కళ్లకు అద్దుకొని బంగారం వంటి పంటలు పండిస్తారు.. ఎవరైనా నిరుపేద రైతులకు కౌలుకు ఇచ్చినా రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతుంది. కానీ, ఇక్కడ మాత్రం 264 ఎకరాల దేవుడిభూములను వృథాగా వదిలేశారు. కేవలం గతంలో కౌలు వేలం విషయంలో అభ్యంతరాలు రావడంతో కినుక వహించిన అధికారులు దాదాపు రెండున్నర దశాబ్దాలుగా నిరుపయోగంగా వదిలేసిన దుస్థితి సింగోటం లక్ష్మీనర్సింహస్వామి ఆలయం చెంత చోటుచేసుకుంది.
– కొల్లాపూర్
నిరుపయోగంగా సింగోటం లక్ష్మీనర్సింహస్వామి ఆలయ భూమి
రెండున్నర దశాబ్దాలుగా సాగుకు నోచుకోని 264 ఎకరాలు
చెంతనే సాగునీటి కాల్వలున్నా బీడువారిన వైనం
గతంలో కౌలు వేలంపై
అభ్యంతరాలు రావడంతో కినుక
ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోని అధికారులు


