
డిగ్రీ కళాశాలలోనే ఎన్నికల సామగ్రి
జడ్చర్ల టౌన్: పట్టణంలోని డాక్టర్ బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న ఎన్నికల సామగ్రిని తరలించకపోవడంతో గదుల కొరత ఏర్పడింది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సామగ్రి, ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను కళాశాలలో ఏర్పాటుచేశారు. ఎన్నికలు ముగిశాక ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తరలించగా.. ఇతర సామగ్రి మొత్తాన్ని కళాశాలలోనే నిల్వ చేశారు. ఇందుకోసం ఫిజికల్ డైరెక్టర్ గదులు రెండింటిని వినియోగిస్తున్నారు. ఈ కారణంగా ఫిజికల్ డైరెక్టర్ గదిని మరోచోట ఏర్పాటు చేసుకోవా ల్సివచ్చింది. 2023 డిసెంబర్ నుంచి ఎన్నికల సామగ్రిని తరలించి తమకు గదులు అప్పగించాలని కళాశాల ప్రిన్సిపాల్ పలుమార్లు అధికారులు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిసింది. అయితే ఆ సామగ్రిని ఎక్కడికి తరలించాలో తెలియక అధికారులు మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోసం కళాశాల గదులను ఇస్తే.. వాటిని 16 నెలలుగా తమకు అప్పగించకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదని అధ్యాపక బృందం వాపోతోంది. ఇప్పటికై నా ఎన్నికల సామగ్రిని తరలించాలని ప్రిన్సిపాల్ సుకన్య కోరుతున్నారు.