
రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం
కల్వకుర్తి రూరల్: భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వేపూరులో జై బాపు– జై భీమ్– జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడంతోపాటు మహాత్మగాంధీ చెప్పిన శాంతి సందేశాన్ని గడపగడపకూ తీసుకెళ్లారు. గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి.. పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన చేస్తున్నాయని విమర్శించారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వాని అన్నారు. దేశంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ఎన్నికల హామీలను నెరవేర్చిన ఘనత తమదేనని చెప్పారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయకుమార్‌రెడ్డి, శ్యాంసుందర్‌రావు, మల్లేష్, శ్రీధర్, వెంకటేశ్వరరావు, లింగమయ్య, పాండురంగారెడ్డి, బాలరాజు, వంశీ, రవి, యుగంధర్, వెంకటేష్, గణేష్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ రాజ్యాంగమే దేశానికి శ్రీరామ రక్ష
కందనూలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని, ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దళితుల అభ్యున్నతి కోసం నిజాయితీగా బీజేపీ మాత్రమే పనిచేస్తుందని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ఉయ్యాలవాడ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహాన్ని నీటితో శుద్ధి చేసి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో గంగిడి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ దేశవ్యాప్తంగా ఈ నెల 13 నుంచి 25 వరకు అంబేడ్కర్ జయంతి ఉత్సవాల పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కుట్రలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అంబేడ్కర్‌కు పోటీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి కుట్రపూరితంగా ఆయనను ఓడించారని విమర్శించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అంబేడ్కర్ చిత్రపటాన్ని ఉంచేందుకు కూడా కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. రాబో యే రోజుల్లో బీజేపీ సెమినార్లు, దళితవాడల్లో కార్నర్ మీటింగ్‌ల ద్వారా కాంగ్రెస్ ఇతర పార్టీలు చేసే తప్పుడు ప్రచారాలను ఎండగట్టి దళిత సామాజిక వర్గాల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ నేత పోతుగంటి భరత్‌ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్బారెడ్డి, ఎస్సీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జలాల్ శివుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్‌రెడ్డి, ఎస్సీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, నాగరాజు, నాగేంద్రగౌడ్, చందు, భీమేశ్వర్‌రెడ్డి, అభిలాష్‌రావు, రాము పాల్గొన్నారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం