
చిన్నారులకు సమగ్ర కంటి పరీక్షలు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని అంగన్‌వాడీల పరిధిలోని ఆరేళ్లలోపు చిన్నారులకు సోమవారం నుంచి సమగ్ర కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని పీహెచ్‌సీల పర్యవేక్షణ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని 1,131 అంగన్‌వాడీ కేంద్రాల్లో 47,317 చిన్నారులకు ప్రాథమిక దశలోనే సమగ్ర కంటి పరీక్ష నిర్వహించి తగిన మందులతో చికిత్స నిర్వహించి.. కంటి అద్దాలు అందించడం వలన అంధత్వాన్ని నివారించగలమన్నారు. చిన్నారుల్లో విటమిన్–ఏ లోపం, మెల్ల కన్ను, టెరీజియం, హ్రస్వ దృష్టి, దీర్ఘ దృష్టి తదితర కంటి సమస్యలు వస్తాయని, వీటిని నివారించడానికి ప్రతి చిన్నారికి సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆర్‌బీఎస్‌కే సంచార వైద్య బృందం, నేత్రాధికారులు సంయుక్తంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం చిన్నారుల సమగ్ర కంటి పరీక్ష కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశాలు తమ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించే సమగ్ర కంటి పరీక్ష శిబిరానికి చిన్నారులు హాజరయ్యేలా చూడాలన్నారు. శిశువులు, చిన్నారుల్లో ఎవరైనా టీకాకరణ చేయించుకోని వారు ఉంటే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో టీకాకరణ క్యాచ్ అప్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వెంకటదాసు, ప్రోగ్రాం అధికారి రవికుమార్, రాజశేఖర్, డీపీఓ రేణుయ్య, ఏపీఓలు మినహాజ్, శ్రీనివాసులు, నిరంజన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.