● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ
మంత్రి సీతక్క
ములుగు: జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో, బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. మండల పరిధిలోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఇంజనీరింగ్ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సీతక్క గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి సంబంధిత ప్రాజెక్టులకు సమగ్ర అంచనాలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల పురోగతికి సంబంధించిన వివరాలను శాఖలవారీగా నమోదు చేయాలని సూచించారు. పనులను సకాలంలో పూర్తి చేయని గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్‌కు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను నిరంతరం రామప్ప సరస్సుకు తరలించే సాధ్యాసాధ్యాలను వెంటనే పరిశీలించాలని సూచించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం సుమారు రూ.200 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.
రూ.8.50 కోట్ల పనులకు శంకుస్థాపన
ములుగు పురపాలక సంఘం నిధులతో మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో రూ.8.50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. బండారుపల్లిలో రూ.5.50 కోట్లతో, జీవింతరావుపల్లిలో రూ.3 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు మంత్రి సీతక్క వివరించారు. అదే విధంగా ములుగు మండలంలో నూతనంగా ఏర్పాటైన బంజారుపల్లి గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఆనంతరం జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్, ఉద్యానశాఖ కార్యాలయాలను మంత్రి సీతక్క తనిఖీ చేసి విధుల్లో లేని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


