ములుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు సంబంధించి తుది దశ ప్రక్రియ మొదలైంది. మ్యాపింగ్ కాని వారితో పాటు అనామలిస్ (స్పష్టమైన గుర్తింపు లేని ఓటర్లు) జాబితాలో చేరిన ఓటర్లకు బీఎల్‌వోలు గురువారం నుంచి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసులు అందుకుంటున్న వారు నిర్ణీత గడువులోగా తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మ్యాపింగ్ కాని, ఆధారాలు సరిగ్గాలేని ఓటర్లకు ఇళ్ల వద్దకే వచ్చి బీఎల్‌వోలు నోటీసులు అందజేస్తున్నారు. 1 జూలై 1987లోపు జన్మించిన వారు నోటీసులు అందుకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. 1987 నుంచి 2004 మధ్యలో జన్మించిన వారు నోటీసు ఆందుకున్న వ్యక్తితో పాటు తల్లి లేదా తండ్రికి చెందిన గుర్తింపు కార్డు అందించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సవరణలు, ఆధారాల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 20న ముగుస్తుంది. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అక్టోబరు 19న తుది ఓటరు జాబితా విడుదల కానుంది.
12 రకాల గుర్తింపు కార్డులు ఇవే..
నోటీసులు పొందిన ఓటర్లు 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని బీఎల్‌వోకి లేదా తహసీల్దార్ కార్యాలయంలో చూపించి తమ ఓటును సరిచేసుకోవాలి. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, పాన్‌కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్‌బుక్, ఉపాధిహామీ జాబ్ కార్డ్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సురెన్స్ కార్డు, పింఛన్ బుక్, రైతు పాస్‌బుక్, ఎన్‌పీఆర్ స్మార్ట్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలి.
8,028 మందికి నోటీసులు
ములుగు నియోజకవర్గంలోని 10 మండలాల పరిధిలో 303 పోలింగ్ బూత్‌లు ఉండగా 2,09,128 మంది ఓటర్లు ఉన్నట్లు ఈ నెల 17వ తేదీన అధికారులు ఓటర్ల మసాయిదాను విడుదల చేశారు. జిల్లాలో నో మ్యాపింగ్, అనామలిస్ ఓటర్లు 41,900 మంది ఉన్నట్లు గుర్తించి వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలో గురువారం సాయంత్రం వరకు 8,028 మందికి నోటీసులు అందించినట్లు అధికారులు తెలిపారు. నోటీసులు తీసుకున్నవారు నిర్ణీత గడువులోపు ఆధారాలు చూపకుంటే ఓటుహక్కును కోల్పోయే ప్రమాదం ఉంది.
లేదంటే ఓటుహక్కు
కోల్పోయే ప్రమాదం
రేపటి నుంచి ఆధారాల స్వీకరణ
జిల్లాలో 41,900 మందికి
జారీ కానున్న నోటీసులు
ఇప్పటి వరకు 8,028 మందికి జారీ
నియోజకవర్గంలో మండలాల వారీగా జారీ చేసిన నోటీసులు
మండలం మొత్తం జారీ
నోటీసులు చేసినవి
మంగపేట 9,589 1,362
ఏటూరునాగారం 3,703 932
ములుగు 6,742 632
గోవిందరావుపేట 2,227 950
కొత్తగూడ 5,342 291
మల్లంపల్లి 648 90
వెంకటాపురం(ఎం) 5,207 1,288
ఎస్‌ఎస్‌తాడ్వాయి 3,772 712
కన్నాయిగూడెం 3,056 1,260
గంగారం 1,614 511


