పోలీస్‌స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ

Aug 26 2026 1:06 AM | Updated on Aug 26 2026 1:06 AM

వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ను ఏటూరునాగారం ఏఎస్పీ మనన్‌ భట్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ రికార్డ్స్‌, క్రైమ్‌ ఫైల్స్‌, పీఎస్‌ పరిసరాలు, ఆయుధాల పనితీరు పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్‌ క్రైమ్‌, మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఆదేశించారు. అదేవిధంగా ఆన్‌లైన్‌ పోర్టల్స్‌, సీసీటీఎస్‌ఎస్‌, రోడ్డు ప్రమాదాల పోర్టల్‌, పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్ల రికవరీల గురించి సమీక్ష నిర్వహించి సిబ్బంది పలు సూచనలు చేశారు. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో సీఐ ముత్యం రమేశ్‌, ఎస్సైలు తిరుపతిరావు, తిరుపతి రెడ్డి, సాయి కృష్ణలు, పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి

ములుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతా ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని, ప్రతీ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజ్జు కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్షాభావ పరిస్థితులు, నీట్‌–పీజీ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ మేరకు జిల్లా నుంచి కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక, చారిత్రక, వారసత్వ, ఎకో టూరిజం, హస్తకళలు, జల పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని అనుసందానిస్తూ పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఈ వీసీలో డీఈఓ సిద్ధార్థ రెడ్డి, డీఐఓ వీరేందర్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మేడిగడ్డకు 1,44,470

క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాణహిత నది వరద ప్రవాహం పెరిగి మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద గోదావరితో కలిసి మేడిగడ్డకు చేరుతోంది. మంగళవారం మేడిగడ్డ వద్ద 1,44,470 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తరలిరావడంతో మొత్తం గేట్లు ఎత్తి నీటి ని దిగువకు తరలిస్తున్నారు. రాత్రి వరకు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ఇంజనీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు.

సీఈఆర్‌ క్లబ్‌ అభివృద్ధికి చర్యలు

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి సీఈఆర్‌ క్లబ్‌ను అభివృద్ధి చేసి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఏరియా జీఎం కార్యాలయంలో సీఆర్‌ క్లబ్‌ కమిటీ సభ్యులతో జీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్‌లోని మౌలిక సదుపాయాల మెరుగుదల, అవసరమైన మరమ్మతులు, కొత్త సౌకర్యాల కల్పన, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. క్లబ్‌ను మరింత ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సూచించారు. అనంతరం సీఆర్‌ క్లబ్‌ కమిటీ సభ్యులు జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డిని సన్మానించారు. ఈ సమావేశంలో పర్సనల్‌ మేనేజర్‌ శ్యాంసుందర్‌, సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ సాయి కృష్ణ, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ పర్స శ్రీనివాస్‌, గుర్తింపు సంఘం బ్రాంచ్‌ కార్యదర్శి రమేష్‌, ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షుడు బేతేల్లి మధుకర్‌రెడ్డి, సీఈఆర్‌ క్లబ్‌ సంయుక్త కార్యదర్శి కాపు చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement