భీమదేవరపల్లి: పేదరికం ప్రతిభకు అడ్డంకి కారాదనే ఉద్దేశంతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మండల కేంద్రానికి చెందిన బొల్లంపల్లి రజిత, సారంగపాణి దంపతుల కుమార్తె హాసిని ఇటీవల పూణేలోని ప్రతిష్టాత్మక తలేగావ్ ఐఐటీ యూనివర్సిటీలో సీటు సాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో ఉన్నత చదువుల కోసం ఫీజులు చెల్లించలేక ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించారు. విద్యార్థిని హాసిని ఉన్నత విద్య ఆగకూడదనే సంకల్పంతో ఆమెకు రూ.3 లక్షల విలువైన ఆర్థిక సహాయం చెక్కు అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పేదరికం కారణంగా ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.


