గోవిందరావుపేట: రైతులు, కార్మికులు తిరగబడితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పతనం తప్పదని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సోమ మల్లారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత సంయుక్త సంఘాల పిలుపులో భాగంగా సోమవారం మండల కేంద్రంలో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేసి కార్మికుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అమెరికాతో చేసుకున్న వ్యవసాయ దిగుమతి ఒప్పందాలను విరమించుకోవాలన్నారు. గ్రామీణ పేదలకు ఉపయోగపడుతున్న ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కోరారు. కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యాక్షుడు పొదిళ్ల చిట్టిబాబు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యాక్షుడు తీగల ఆదిరెడ్డి, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి గొంది రాజేష్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల మురళి, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి
మల్లారెడ్డి


