ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ రంగాలలో ఉచిత శిక్షణ, వసతి, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పీఓ లెనిన్ వత్సల్ టొప్పొ తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యూత్ ట్రైనింగ్ సెంటర్స్‌లో నేషనల్ స్కిల్ సెక్టార్ ట్రైనింగ్ ఏజెన్సీల ద్వారా సుమారు 75 రోజుల నుంచి 178 రోజుల వరకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఏటూరునాగారం కేంద్రంలో సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైలర్, ఎంబ్రాయిడరీ మెషిన్ ఆపరేటర్, బ్యూటీ థెరపిస్ట్, హెయిర్ డ్రెస్సర్, వరంగల్ కేంద్రంలో జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, వేర్ హౌస్ సూపర్ విజన్, ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్, ఇరిగేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, కాటారం కేంద్రంలో ఫుడ్ – బెవరేజ్ సర్వీస్, సోలార్ పంప్ టెక్నీషియన్, టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్, ఫీల్డ్ టెక్నీషియన్ (ఏసీ), డిజిటల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంశాలలో ఉచిత వసతి, శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు విద్యార్హత జిరాక్స్ పత్రాలతో ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఈ నెల 19వ తేదీ వరకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారాని కి సెల్ నంబర్ల 9490341911, 8008932159, 7981633716లో సంప్రదించాలని తెలిపారు.
శిక్షణలో ఏకాగ్రత అవసరం
బ్యూటీషన్, టైలరింగ్ శిక్షణలో నిరుద్యోగులకు ఏకాగ్రత అవసరమని పీఓ లెనిన్ వత్సల్ టొప్పొ అన్నారు. మండల కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో కొనసాగుతున్న శిక్షణ శిబిరాన్ని పీఓ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూత్ ట్రైనింగ్ సెంటర్‌లోని క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, డార్మెంటరీ రూమ్స్‌ను పరిశీలించారు. అదేవిధంగా ట్రైకార్ ద్వారా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలపై ఆరా తీశారు.
ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పొ


