ధ్వంసమైన పుష్కరఘాట్ పరిశీలన
మంగపేట: మండల కేంద్రంలోని పొదుమూరు సమీపంలో గోదావరి ఒడ్డున 2015లో పుష్కరఘాట్ నిర్మించారు. గోదావరి వరదలకు ధ్వంసమైన ఈ ప్రాంతాన్ని ఇరిగేషన్ ఈఈ శంకరయ్య రెవెన్యూ పంచాయతీ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 జూన్‌లో జరుగనున్న గోదావరి పుష్కరాలకు పుష్కరఘాట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు స్థల పరిశీలనకు వచ్చినట్లు వెల్లడించారు. 2015లో పుష్కరాల సందర్భంగా రూ.5.64 కోట్లతో 170 మీటర్ల మేర నిర్మించిన పుష్కరఘాట్‌ను పరిశీలించినట్లు తెలిపారు. మండలంలో 2027 జూన్‌లో జరిగే పుష్కరాలకు పుష్కరఘాట్ ఏర్పాటు చేసేందుకు ఈ నెల 18న ఉన్నతాధికారులు అనుకూలమైన స్థలాన్ని పరిశీలించేందుకు మండలానికి రానున్నట్లు వివరించారు. ముందస్తుగా అనుకూలమైన స్థలాన్ని గుర్తించేందుకు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం గోదావరి కరకట్ట నిర్మాణం జరుగుతున్నా దొంగల ఒర్రె ప్రాంతాన్ని కూడా పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ రవికుమార్, ఏఈ వలీమ్‌మహ్మద్, జీపీఓ రాములు, నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.


