లక్నవరం తైబందీకి గ్రీన్‌సిగ్నల్
గోవిందరావుపేట: మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం లక్నవరం చెరువు తైబందీ సమావేశాన్ని నిర్వహించి నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సమావేశంలో తైబందీ రొటేషన్ విధానంపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతేడాది అమలు చేసిన విధానాన్ని సమీక్షించిన అనంతరం ఈ ఏడాది సాగునీటి పంపిణీపై స్పష్టమైన తీర్మాణానికి వచ్చారు. గతేడాది తైబందీ రొటేషన్ పద్ధతిలో భాగంగా శ్రీరాంపతి, నర్సింహుల కాల్వల ద్వారా సుమారు 4,150 ఎకరాలకు సాగునీరు అందించిన విషయం సమావేశంలో ప్రస్తావించారు. అదే విధానాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం రంగాపూర్, కోట, శ్రీరాంపతి కాల్వలకు సుమారు 5,650 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా రైతులు సహకరించాలని అధికారులు కోరారు. నిర్ణయించిన విస్తీర్ణం కంటే ఎక్కువగా సాగు చేయడానికి ప్రయత్నిస్తే అందరికీ సమృద్ధిగా నీరు అందక పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తైబందీ నిబంధనలు పాటించినప్పుడే ఆయకట్టు రైతులందరికీ సమానంగా నీరు అందుతుందన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం మేడారం జాతర అవసరాల కోసం లక్నవరం చెరువు నుంచి 200 ఎంసీఎఫ్‌టీ నీటిని కేటాయించినట్లు సమావేఽశంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో సాగునీటి వినియోగంలో మరింత జాగ్రత్త అవసరమని అధికారులు సూచించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ కార్యనిర్వహక ఇంజనీర్ నారాయణ, తహసీల్దార్ సృజన్ కుమార్, వ్యవసాయ అధికారి జితేందర్ రెడ్డి, ఇరిగేషన్ డీఈఈ రవీందర్ రెడ్డి, ఏఈ ఉపేందర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
రొటేషన్ పద్ధతిలోనే సాగునీటి పంపిణీ


