లెప్రసీ సర్వే డబ్బులను విడుదల చేయాలి
● సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్
ములుగు రూరల్: ఆశ వర్కర్లు గతంలో చేపట్టిన లెప్రసీ సర్వే డబ్బులను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్‌జీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆశ వర్కర్లతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తుందన్నారు. గతంలో లెప్రసీ సర్వే డబ్బులు విడుదల చేయకుండా మళ్లీ సర్వే చేయమని చెప్పడం సరికాదన్నారు. ఆశ వర్కర్లకు పారితోషికాలను రద్దు చేసి ఫిక్స్‌డ్ వేతనాలు రూ.18 వేలు అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ వర్కర్లకు కనీస వేతనం చెల్లించడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విధులు నిర్వహించిన వారికి డబ్బులు చెల్లించాలన్నారు. కేంద్రం పెంచిన రూ.1500 పారితోషికాన్ని అమలు చేయాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అర్హత కలిగిన ఆశ వర్కర్లకు ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం ప్రమోషన్ కల్పించాలని కోరారు. గత 15 రోజుల సమ్మె హామీలను అమలు చేయాలన్నారు. ఆశ వర్కర్లకు బీమా రూ. 50 లక్షలు, పదవీ విరమణ బెనిఫిట్స్ రూ.5 లక్షలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండబోయిన రవిగౌడ్, ఆశ వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి, శ్రావ్య, నాగమణి, సరిత, రజిత, కవిత, రాజ్యలక్ష్మీ, సంధ్య, పూర్ణ, శోభ, కృష్ణకుమారి, రమాదేవి, సుమలత, భాగ్య, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.


