మెరుగైన ఫలితాల సాధనకు పాటుపడాలి
● అదనపు కలెక్టర్ మహేందర్ జీ
ములుగు: జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లోని విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా అధ్యాపకులు పాటుపడాలని అదనపు కలెక్టర్ మహేందర్‌జీ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపాల్స్, సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో కళాశాలల వారీగా గతేడాది, ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బోర్డు పరీక్షల వరకు 50 రోజుల యాక్షన్ ప్లాన్ తయారుచేయాలన్నారు. పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రతీ విద్యార్థి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా తీర్చిదిద్దాలన్నారు. కళాశాలలో ఉన్నత ఫలితాలను సాధిస్తేనే వచ్చే సంవత్సరంలో అడ్మిషన్లు వస్తాయని తెలిపారు. విద్యార్థులకు మంచి చదువు, క్రమశిక్షణ నేర్పించి వారు ఉన్నత స్థాయికి చేరుకునేలా తయారు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి డి.చంద్రకళ, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.


