కామేశ్వరాలయ పునాది మట్టి తొలగింపు | - | Sakshi
Sakshi News home page

కామేశ్వరాలయ పునాది మట్టి తొలగింపు

Apr 5 2025 1:24 AM | Updated on Apr 5 2025 1:24 AM

వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయం పక్కన ఉన్న కామేశ్వరాలయ పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. కామేశ్వరాలయాన్ని పునర్నిర్మించేందుకు ఆలయ ప్రదేశంలో ఉన్న మట్టిని జేసీబీ, ట్రాక్టర్లతో తొలగిస్తున్నారు. సాండ్‌ బాక్స్‌ టెక్నాలజీ ప్రకారం ఆలయం అడుగుభాగాన పోసే ఇసుక కొట్టుకుపోకుండా ఆలయం చుట్టూ రెండు మీటర్ల లోతు నుంచి రాయితో గోడను నిర్మించారు. ఆలయం అడుగుభాగంలో ఉన్న లూజ్‌ మట్టిని తొలగించి లెవలింగ్‌ పనులు చేస్తున్నారు. మట్టి తొలగించిన అనంతరం ఆలయ అడుగుభాగంలో పెద్దరాళ్లను పేర్చి ఇసుకతో నింపనున్నారు. సాండ్‌ బాక్స్‌ టెక్నాలజీ ద్వారానే కామేశ్వరాలయాన్ని పునరుద్ధరించేందుకు పురావస్తుశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

సన్నబియ్యం పంపిణీ

వేగవంతం చేయాలి

ములుగు: సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం సీఎస్‌ శాంతికుమారితో కలిసి ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్‌ టీఎస్‌ దివాకర, అదనపు కలెక్టర్‌ సీహెచ్‌ మహేందర్‌జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ టీఎస్‌ దివాకర మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 222రేషన్‌ దుకాణాలు ఉన్నాయని అన్నారు. 91,563 రేషన్‌ కార్డులు ఉండగా 2,57,841 మంది లబ్ధిదారులకు 1702.096 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్‌ సప్‌లై డీఎం రాంపతి, జిల్లా అధికారి ఫైజల్‌ హుస్సేని, అధికారులు పాల్గొన్నారు.

నేటినుంచి

శ్రీరామనవమి వేడుకలు

మూడు రోజుల పాటు ఉత్సవాలు

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం దేవస్థానం అనుబంధ దేవాలయం శ్రీరామాలయంలోని శ్రీసీతారామ చంద్రస్వామివార్ల ఆలయంలో శనివారం నుంచి సోమవారం వరకు శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ మహేష్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈనెల (నేడు) 5న శనివారం సాయంత్రం 4గంటలకు అధ్యాయనోత్సవం, ప్రబంద పారాయణం, రాత్రి 8గంటలకు ఎదురుకోలు సేవ కార్యక్రమం నిర్వహిస్తారు. 6న ఆదివారం ఉదయం 10.31గంటలకు రామాలయం కల్యాణ మండపం వద్ద ఉత్సవమూర్తులకు కల్యాణం నిర్వహిస్తారు. రాత్రి 7గంటలకు హవనం, బలిహరణం జరిపిస్తారు. 7న సోమవారం ఉదయం 11గంటలకు పూర్ణహుతి, సాయంత్రం 5గంటలకు శ్రీపుష్పయాగం, ఏకాంత సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి భక్తులు తరలి రానున్నారు.

విద్యా సామర్థ్యాల

పెంపునకు కృషి

భూపాలపల్లి అర్బన్‌: విద్యా సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సర్వ శిక్ష జిల్లా మానిటరింగ్‌ అధికారి కాగితపు లక్ష్మణ్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు పదోన్నతి పొందిన బయాలజీ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలు ఆయా పాఠశాలల్లో తరగతి గదిలో అమలు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందన్నారు. జీవశాస్త్రపు ఉపాధ్యాయులు విద్యా సామర్‌ాధ్యల ఆధారంగా బోధన చేసి విద్యా ప్రమాణాలు పెంచాలన్నారు. ఆశించిన ఫలితాలను రాబట్టాలని చెప్పారు. రిసోర్స్‌ పర్సన్‌లు డాక్టర్‌ మార్క వీణావాణి, కుర్రి శ్రీనివాసులు మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాల ప్రకారం విద్యార్థులకు బోధన చేసి విద్యార్థులలో సైన్స్‌ పట్ల అభిరుచిని, ఆసక్తిని పెంపొందించాలన్నారు. ప్రయోగాత్మక పద్ధతి, కృత్యాదార బోధనల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులు కామిడి సతీష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, సారంగపాణి, జ్యోతి, సరిత పాల్గొన్నారు.

కామేశ్వరాలయ  పునాది మట్టి తొలగింపు
1
1/1

కామేశ్వరాలయ పునాది మట్టి తొలగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement