
మాస్ యాక్టర్‌గా విశ్వక్ సేన్‌కి మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దర్శకునిగా తొలి చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’తోనే తన ప్రతిభను నిరూపించుకున్నారు విశ్వక్. ఆ తర్వాత ‘దాస్ కీ దమ్కీ’ చిత్రంలో నటించి, దర్శకత్వం వహించారు. ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా ఆయన డైరెక్షన్‌లోనే ‘#కల్ట్’ చిత్రం ఆరంభమైంది. ఈ చిత్రానికి కథ కూడా రాసుకున్నారు విశ్వక్. 40 మంది నూతన నటీనటులను పరిచయం చేస్తూ, కరాటే రాజు, సందీప్ కాకర్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చిన్నబాబు) టైటిల్ లోగోను లాంచ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముహూర్తపు షాట్‌కు కెమెరా స్విచ్చాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ఆదివారమే రెగ్యులర్ షూటింగ్ ఆరంభించారు. ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా న్యూ ఏజ్ పార్టీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. నటుడు–దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: అరవింద్ విశ్వనాథన్.