
కొడుకు సూర్య వైరల్ వీడియో వివాదంపై తమిళ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) స్పందించాడు. తన కొడుకు చేసిన పనికి ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని అని మీడియా ముఖంగా తెలియజేశాడు. విజయ్ సేతుపతి కొడుకు సూర్య(Surya) హీరోగా నటించిన తొలి సినిమా ‘ఫీనిక్స్’ జులై 4న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి టాక్ సంపాదించుంది. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోనే వివాదస్పదంగా మారింది. సూర్యకు సంబంధించిన వీడియోలను డిలీట్ చేయాలని అతని టీమ్ మీడియాపై ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై విజయ్ సేతుపతి స్పందించాడు.
‘సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు నిజంగా అలాంటి ఒత్తిడి తెచ్చి ఉంటే.. అది తెలియకుండా జరిగి ఉండవచ్చు లేదా వేరొకరు చేసి ఉండవచ్చు. ఈ విషయంలో ఎవరైనా బాధపడితే వారిని నా తరపున క్షమాపణలు చెబుతున్నాను’ అని విజయ్ సేతుపతి అన్నారు.
ఫినిక్స్ విషయానికొస్తే..ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్. స్టంట్ మాస్టర్ అనల్ అరసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.దేవదర్శిని, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జులై 4న విడుదలైన ఈ చిత్రానికి ప్రశంసలు అయితే భారీగానే వచ్చాయి కానీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. పోటీలో సిద్ధార్థ్ 3బీహెచ్‌కే తో పాటు మరో సినిమా ఉండడం వల్లే.. తొలిరోజు ఫినిక్స్‌కి అతి తక్కువ(రూ. 10 లక్షలు) వసూళ్లు వచ్చాయి. వారంతంలో కలెక్షన్స్ పెరిగే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విజయ్ సేతుపతి విషయానికొస్తే.. ఇటీవల ఏస్ చిత్రంలో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ‘తలైవన్ తలైవీ’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నిత్యా మీనన్, యోగి బాబు, చెంబన్ వినోద్ జోస్, శరవణన్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు.