Varudu Kaavalenu Movie: 'ప్రతి అమ్మాయికి, అబ్బాయికి కనెక్ట్‌ అవుతుంది'

Varudu Kaavalenu Movie Director Lakshmi Soujanya About Movie - Sakshi

‘‘సినిమాలు, అందులోని క్యారెక్టరైజేషన్స్‌ చూసి చాలామంది స్ఫూర్తి పొందుతారు. కాబట్టి ప్రేక్షకులను తప్పుదోవ పట్టించకూడదు. పదిమందిని బాగుచేయకపోయినా పర్లేదు కానీ ఒక్కర్ని కూడా చెడగొట్టకూడదు. దర్శకత్వాన్ని నేనో బాధ్యతగా స్వీకరించాను. నేను ఏ సినిమా చేసినా చూసినవారు హ్యాపీగా ఉండేలా, ఒక మంచి విషయం నేర్చుకునేలా తీయాలనుకుంటాను’’ అన్నారు దర్శకురాలు లక్ష్మీ సౌజన్య.

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా లక్ష్మీ సౌజన్య చెప్పిన విశేషాలు.

కర్నూలు జిల్లాలో పుట్టాను. గుంటూరులో పెరిగాను. సినిమాలంటే ఇష్టం. అందుకే ఈ ఇండస్ట్రీని ఎంచుకున్నాను. దర్శకులు తేజ, శేఖర్‌ కమ్ముల, కృష్ణవంశీ, ప్రకాశ్‌ కొవెలమూడి, మంజుల... 15 సంవత్సరాలు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. ఇక ఇలాగే ఉంటే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానే ఉండిపోతానేమోనని ‘వరుడు కావలెను’ కథ రాసుకుని దర్శకురాలిగా మారాను. ∙2017లో ‘వరడు కావలెను’ సినిమా స్టోరీలైన్‌ను నిర్మాత చినబాబుకు చెప్పాను. ఆయనకు నచ్చింది. ఆ తర్వాత పూర్తి కథ తయారు చేశాను.. ఓకే అన్నారు.

కానీ అనుకోకుండా మా నాన్నగారు దూరం కావడం, కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. ముందు ఈ కథను నాగచైతన్యకు చెప్పాను. కానీ ప్రాజెక్ట్‌ కుదర్లేదు. ఆ తర్వాత నాగశౌర్య ఓకే అయ్యారు. ∙ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి తనకు కాబోయే వరుడిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని ఆశపడుతుందో అదే ‘వరుడు కావలెను’ సినిమా. ఇందులో ఆర్కిటెక్చర్‌ ఆకాశ్‌ పాత్రలో నాగశౌర్య, ఎకో–ఫ్రెండ్లీ బిజినెస్‌ ఉమెన్‌ భూమి పాత్రలో రీతూ వర్మ కనిపిస్తారు. ఇద్దరూ బాగా చేశారు.

ఈ సినిమాకు విశాల్‌ చంద్రశేఖర్‌ మంచి సంగీతం అందించారు. మాస్‌ సాంగ్స్‌ కోసం తమన్‌ని  తీసుకున్నాం. నిర్మాత చినబాబుగారు ఈ సినిమాకు హీరో. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్టే లేదు. ఓ పెద్ద నిర్మాణసంస్థ ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. అయితే రిలీజ్‌ టెన్షన్‌ ఉంది. కానీ సినిమా చూసిన ప్రతి అబ్బాయి, అమ్మాయి మా ‘వరుడు కావలెను’ సినిమాకు కనెక్ట్‌ అవుతారని నమ్మకం ఉంది.

సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి రంగంలోనూ అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇప్పుడు సమానమైన అవకాశాలు ఉంటున్నాయి. ఎవరైనా రన్నింగ్‌ రేస్‌లో పరిగెత్తాల్సిందే. పరిగెత్తగలిగితేనే రావాలి. నేను అమ్మాయిని కాబట్టి రిజర్వేషన్‌ ఇవ్వండి అంటే కుదరదు. ప్రతిభ ఉన్నప్పుడు ఎవరికైనా ప్రోత్సాహం లభిస్తుంది. నా దగ్గర కథలు ఉన్నాయి. ఐడెంటిటీ క్రైసిస్‌పై (గుర్తింపు కోసం తపన) ఓ సినిమా చేయాలనుకుంటున్నాను.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top