
కొందరు సెట్స్‌లో... కొందరు నేచురల్ లొకేషన్స్‌లో... ఇలా హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తూ ఈ వారం అంతా బిజీ బిజీగా గడిపారు కొందరు స్టార్స్. ఆదివారం, దీపావళికి సోమవారం బ్రేక్ తీసుకోనున్న స్టార్స్ కొందరైతే... హాలిడే లేకుండా షూట్‌లో పాల్గొననున్న స్టార్స్ కూడా ఉన్నారు. ఇక గత ఆరేడు రోజులుగా హైదరాబాద్‌లో ఏయే సినిమాల షూటింగ్స్ జరి గాయో తెలుసుకుందాం.
సెట్‌లో శంకరవరప్రసాద్...
చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత చిరంజీవి, నయనతార జోడీగా కలిసి నటిస్తున్న సినిమా ఇది. అయితే ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నయనతార నటించిన సంగతి తెలిసిందే. ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలో హీరో వెంకటేశ్, హీరోయిన్ కేథరిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో చిరంజీవి, నయనతార, కేథరిన్, నటుడు సచిన్ ఖేడేకర్‌లతో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. ఈ మూవీలో చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ‘విశ్వంభర’ సినిమా 2026 వేసవిలో రిలీజ్ కానుంది.
ఆర్‌ఎఫ్‌సీలో అడ్వెంచర్
మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ (వర్కింగ్ టైటిల్). రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రధారులు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తు్త్తన్నారు. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ మహేశ్‌బాబుకి సంబంధించిన ఎలాంటి లుక్ అధికారికంగా చిత్రయూనిట్ విడుదల చేయలేదు. అయితే చిత్రీకరణ సమయంలోని కొన్ని ఫొటోలు లీక్ అయిన సంగతి తెలిసిందే.
అమేజాన్ అడవుల నేపథ్యంలో భారీ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో మహేశ్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజ్‌లో నిర్మిస్తున్నారనే టాక్ నడుస్తోంది.
ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకీ లభించని ఘనత ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’కి దక్కనుందని టాక్. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కెన్యా దేశంలో ఈ సినిమా చిత్రీకరణని ΄్లాన్ చేశారు రాజమౌళి. ఇప్పటికే ఆయన అక్కడి లొకేషన్స్‌ని కూడా పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన మొదటి బిగ్ రివీల్ ఈ నవంబరులో రానుండటంతో అందరిలో ఎంతో క్యూరియాసిటీ నెలకొంది.
యాక్షన్ ఎంటర్‌టైనర్...
పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్‌సింగ్’ (2012) తర్వాత హీరో పవన్ కల్యాణ్– డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రమిది. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సీన్స్‌ని తెరకెక్కిస్తున్నారట హరీష్ శంకర్. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావొచ్చిందట. నవంబరు చివరికల్లా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని ఫిల్మ్‌నగర్ టాక్.
హిట్ కాంబినేషన్‌లో...
హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరిలది హిట్ కాంబినేషన్ అని చెపొ్చ్చు. వీరి ముగ్గురి కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ (2023) మూవీ బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ హిట్ కాంబోలో వస్తున్న ద్వితీయ చిత్రం ‘ది ΄్యారడైజ్’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఈ మూవీ కోసం వేసిన ప్రత్యేకమైన సెట్స్‌లో చిత్రీకరిస్తున్నారు. నానితో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్‌లో పాల్గొంటోందట.
ఈ చిత్రంలో నాని పాత్ర పేరు జడల్. గతంలో విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. హీరో లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్. ‘దసరా’ వంటి హిట్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ΄్యారడైజ్’ పై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
ఓ వీరాభిమాని కథ
రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ‘మిస్టర్ బచ్చన్, కింగ్‌డమ్’ చిత్రాల ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలుపోషిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలోని రైల్వేస్టేషన్‌లో హీరో రామ్‌పై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు మహేశ్‌బాబు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. రామ్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై పలు సన్నివేశాలను తీస్తున్నారట దర్శకుడు. ఈ సినిమాలో ఉపేంద్ర ఓ స్టార్ హీరోగా నటిస్తుండగా ఆయన వీరాభిమాని పాత్రలో రామ్‌పోతినేని నటిస్తున్నారు. తన అభిమాన హీరో కోసం ఈ వీరాభిమాని ఏం చేశాడు? అన్నది తెలియాలంటే నవంబరు 28 వరకు వేచి ఉండాలి. ఈ చిత్రం అదే రోజు విడుదల కానుంది.
అల్యూమినియం ఫ్యాక్టరీలో...
హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్‌సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘తండేల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో పాటు తొలిసారి వంద కోట్ల క్లబ్‌లో చేరారాయన. ‘తండేల్’ వంటి హిట్ మూవీ తర్వాత ‘విరూపాక్ష’ (2023) మూవీ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న ‘ఎన్‌సీ 24’ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నాగచైతన్య, మీనాక్షీ చౌదరితో పాటు ఇతర నటీనటులు ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారట. ‘తండేల్’లో ఫుల్ మాస్ లుక్‌లో కనిపించిన నాగచైతన్య ‘ఎన్‌సీ 24’లో స్టైలిష్‌గా సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. అదే విధంగా మీనాక్షీ చౌదరి కూడా సరికొత్త పాత్రలో కనిపిస్తారు.
రాయలసీమ నేపథ్యంలో...
అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి విజయవంతమైన సినిమా తెరకెక్కించిన మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ‘లెనిన్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని బూత్ బంగ్లాలో జరుగుతోంది. అఖిల్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు మురళీ కిశోర్.
రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్, గెడ్డంతో మాస్ లుక్‌లోకి మారిపోయారు అఖిల్. ఈ సినిమాలో తొలుత శ్రీలీల హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారు. అయితే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. శ్రీలీల స్థానాన్ని ‘మిస్టర్ బచ్చన్, కింగ్‌డమ్’ సినిమాల ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే రీప్లేస్ చేశారట. అయితే హీరోయిన్ విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు మేకర్స్.
యాక్షన్... ఎమోషన్
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పూరిసేతుపతి’ (వర్కింగ్ టైటిల్) అనే పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు. టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, విజయ్‌కుమార్, బ్రహ్మాజీలతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట పూరి జగన్నాథ్. తనదైన మాస్, కమర్షియల్ స్టయిల్‌లో ఒక యునిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారట పూరి. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ముచ్చింతల్‌లో మహాకాళి
‘హనుమాన్’ మూవీ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘మహాకాళి’. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రూపొందిన తొలి చిత్రం ‘హను–మాన్’ (2024) పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో 12 సూపర్ హీరోస్ సినిమాలను తెరకెక్కించనున్నట్లు గతంలో ప్రకటించారు ప్రశాంత్ వర్మ. అందులో భాగంగా ఈ యూనివర్స్‌లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘మహాకాళి’. ప్రశాంత్ వర్మ క్రియేటర్, షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.
ఆర్‌కే దుగ్గల్ సమర్పణలో ఆర్‌కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. అమ్మవారి చుట్టూ అల్లుకున్న కథతో బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. నటీనటుల వివరాలను మేకర్స్ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే అసురుల గురువు శుక్రాచార్యుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్నట్లు ప్రకటించి, ఆయన ఫస్ట్ లుక్‌ని మాత్రం ఇటీవల రిలీజ్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ‘మహాకాళి’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. నటీనటులపై కీలకసన్నివేశాలు తీస్తున్నారు మేకర్స్. డిసెంబరు నెలాఖరుకి ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది.
పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్