
పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసే అతికొద్ది మంది కథానాయకులలో నటుడు విక్రమ్ ఒకరు. ఈయన జయాపజయాలకు అతీతుడనే చెప్పాలి. విక్రమ్ చిత్రం వస్తుందంటేనే అభిమానుల్లో అంచనాలు వేరే లెవెల్‌లో ఉంటాయి. ఈయన ఇటీవల హీరోగా నటించిన వీర ధీర సూరన్ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా విక్రమ్ నటన, శారీరక భాషకు ప్రశంసలు లభించాయి. తదుపరి రెండు మూడు చిత్రాల్లో విక్రమ్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవన్నీ చర్చల దశలో ఉన్నాయి. కాగా ప్రస్తుతం శాంతి టాకీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం.

కాగా తాజాగా విక్రమ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. యువ దర్శకుడు విష్ణు ఎడవన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించనున్నారు. ప్రస్తుతం నయనతార, కెవిన్ కలిసి నటిస్తున్న హాయ్ చిత్రం ద్వారా విష్ణు ఎడవన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. దీన్ని జి.స్టూడియోస్, లలిత్ కుమార్, దర్శకుడు విఘ్నేష్ శివన్ కలిసి నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. తదుపరి విక్రమ్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది.
ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కె.గణేశ్ నిర్మించనున్నట్లు సమాచారం. హాయ్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విక్రమ్ హీరోగా నటించే చిత్రానికి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.