
ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రేమకథ చిత్రం '8 వసంతాలు'. గత నెలలో జూన్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దగా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ సందడి చేస్తోంది. అయితే థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమా మాత్రం ఓటీటీలో అదరగొడుతోంది. పలువురు ఓటీటీ సినీ ప్రియులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. 8 వసంతాల డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి ఇటీవలే ఎనిమిది వసంతాల మూవీ స్క్రిప్ట్ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ఓటీటీలో వస్తున్న రెస్పాన్స్ చూసి కొందరు థియేటర్లలో ఈ సినిమాను మిస్సయ్యామని చాలామంది తనకు మేసేజ్లు చేస్తున్నారని దర్శకుడు ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అయితే అందుకు చాలా కారణాలు ఉన్నాయని అన్నారు. జూలై 11న ఓటీటీకి వచ్చినప్పటికీ ఇప్పటికీ 8 వసంతాలు కూకట్పల్లిలోని పీవీఆర్ నెక్సస్ మాల్ థియేటర్లో అందుబాటులో ఉందని తెలిపారు. ఎవరైనా థియేటర్లో మిస్సయితే వెళ్లి చూడాలంటూ సలహా ఇచ్చారు.
(ఇది చదవండి: ఓటీటీలో '8 వసంతాలు'.. నెలలోనే స్ట్రీమింగ్)
అయితే ఇంటర్వ్యూల్లో నన్ను ఎవరైనా పొగిడినా, మా సినిమాకు మద్దతుగా మాట్లాడినా కొందరు నేను డబ్బులిచ్చారని అంటున్నారు. నెగెటివ్పై పెట్టిన శ్రద్ధ.. పాజిటివ్ వైపు పెడితే.. మీ జీవితంతో పాటు ప్రపంచం కూడా బాగుంటుందని దర్శకుడు అన్నారు. ఒక థియేటర్ ఓనర్ ఎవరో డబ్బులు ఇచ్చారని సినిమాను ఆడించడు.. అతనికి డబ్బులు వస్తున్నాయి కాబట్టే సినిమాను ఆడిస్తాడని తన పోస్ట్‌లో ప్రస్తావించారు. థియేటర్లే దొరకడం కష్టమైన ఈ రోజుల్లో పెద్ద సినిమాలు ఉన్నా.. నెగెటివిటీ ఉన్నా.. అన్నింటిని దాటుకుని మా సినిమా థియేటర్లో 27 రోజులు పూర్తి చేసుకుందంటే అందులో ఉన్న విషయం.. అది చేయగలుతున్న ఒంటరి పోరాటం.. మీ ఊహకే వదిలేస్తున్నా అంటూ ఫణీంద్ర నర్సెట్టి తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు.
