VIshnu VIshal: తెలుగింటి అల్లుడిని.. మంచి కంటెంట్‌ ఉన్న ‘మట్టి కుస్తీ’ తో వచ్చా

Tamil Actor VIshnu VIshal Talk About His Latest Movie Matti Kusthi Movie - Sakshi

కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ హీరో గా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ’. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాను ‘ఆర్‌ టీ టీమ్ వర్క్స్’, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్స్ పై మాస్ మహారాజా రవితేజ తో కలిసి విష్ణు విశాల్ నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్‌ లోని ప్రముఖ ఏ ఎం బీ మాల్‌ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కోసం నిర్వహించిన ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో హీరో విష్ణు విశాల్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి పాల్గొని సందడి చేశారు. సినిమాలోని పాటకు స్టెప్పులేసి  అభిమానులను అలరించారు. 

అనంతరం విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ‘నేను జ్వాలా గుత్తాను పెళ్లి చేసుకున్న విషయం మీకు తెలిసిందే. నేను తెలుగింటి అల్లుడిని. నేను జ్వాలాని పెళ్లి చేసుకున్నాక తెలుగు సినిమాలు చేయమని జ్వాలా నన్ను హైదరాబాద్‌ కు తీసుకొచ్చింది. నా కెరీర్ లో అతిపెద్ద సినిమా ‘మట్టి కుస్తీ’తో ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. ఇందుకు కారణమైన జ్వాలాకు, నన్ను నమ్మి సినిమాను నిర్మించిన రవితేజ సర్‌ కు ధన్యవాదాలు.

రాక్షసన్, అరణ్య, ఎఫ్ఐఆర్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు నేను తెలుసు. ఇప్పుడు మట్టి కుస్తీతో మీ ముందుకు వస్తున్నా. ఎంటర్ టైన్ మెంట్, కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తారు. మా మట్టి కుస్తీ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి కంటెంట్ ఉంది. ఏ హీరో, ఏ భాష అనేది చూడకుండా కంటెంట్‌ ను మాత్రమే చూసి ఆదరించే తెలుగు ప్రేక్షకులపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నా’ అన్నారు.

ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. ‘నేను చేసిన ‘అమ్ము’, ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అలాగే ఈ ‘మట్టి కుస్తీ’ సినిమాను కూడా థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. రవితేజ సర్ విష్ణు విశాల్ సర్‌ ను నమ్మి ఖర్చుకు వెనకాడకుండా ఎంతో గ్రాండియర్‌ గా ఈ సినిమాను నిర్మించారు. రవితేజ గారి వల్లే నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చా. డిసెంబర్ 2న థియేటర్లలో మా సినిమాను చూసి ఆదరించండి’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top