
ఐటెం సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బ్యూటీ తమన్నా అని చెప్పవచ్చు. చాలామంది అగ్ర కథానాయికలు ఐటమ్ సాంగ్స్‌లో నటిస్తున్నా, తమన్నా నటిస్తున్న ఐటమ్ సాంగ్స్‌లో ఉండే మజానే వేరు. అది తెలుగు, తమిళం, హిందీ ఏ భాషలో అయినా కావచ్చు ఆమె చేసే డాన్స్‌లో ఉండే కిక్కే వేరు. ఇటీవల హిందీ చిత్రం 'స్త్రీ2'లో తమన్నా నటించిన ప్రత్యేక పాట ఆ చిత్రానికే హైలెట్ అయింది. కాగా ఆ మధ్య తమిళంలో రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన జైలర్ చిత్రంలో 'వా నువ్వు కావాలయ్యా' అనే ప్రత్యేక పాటలో తమన్నా డాన్స్ తీసుకొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏకంగా ఈ సాంగ్ ఆడియో, వీడియో కలిపి 500 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
తాజాగా జైలర్–2 చిత్రం కోసం నువ్వు కావాలయ్యా 2.ఓ పాట లోడింగ్ అవుతున్నట్లు తెలిసింది. కూలీ చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్.. ప్రస్తుతం తన కెరీర్‌కు బూస్ట్ ఇచ్చిన జైలర్ చిత్రానికి సీక్వెల్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం జైలర్–2 చిత్ర షూటింగ్ కేరళలో జరుగుతోంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్, బాలకృష్ణ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని, విజయ్ కార్తీక్ కన్నన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా తమన్నా జైలర్–2 చిత్రంలోని క్యామియో పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. దీంతో నువ్వు కావాలయ్యా 2.ఓ లోడింగ్ అవుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.