దిల్‌ బేచారా: కంటతడి పెట్టించిన సుశాంత్‌

Sushant Singh Rajput Singh Dil Bechara Movie Telugu Review - Sakshi

టైటిల్‌: దిల్‌ బేచారా
న‌టీనటులు: సుశాంత్ సింగ్‌ ‌ రాజ్‌పుత్‌ , సంజనా సంఘి, సైఫ్‌ అలీఖాన్‌(అతిథి పాత్ర), స్వస్థికా ముఖర్జీ తదితరులు
దర్శకుడు: ముఖేశ్‌ చాబ్రా
నిర్మాణ సంస్థ: ఫాక్స్ స్టార్ స్టూడియోస్
సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌
విడుద‌ల‌: డిస్నీ- హాట్‌స్టార్‌ (జూలై 24)

సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌.. సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. అభిమానులను శోక సంద్రంలో ముంచి దివంగతాలకేగిన ఈ టాలెంటెడ్‌ యాక్టర్‌ నటించిన చివరి చిత్రం ‘దిల్‌ బేచారా’. జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడి అంతులేని ఆవేదనను మిగిల్చిన సుశీ.. ఆఖరి సినిమాను వెండితెరపైనే చూడాలని అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు. అయితే కరోనా మహమ్మారి కట్టడికై విధించిన లాక్‌డౌన్‌ కారణంగా‘దిల్‌ బేచారా’ను ఓటీటీ వేదికగా విడుదల చేయాల్సి వచ్చింది. సుశాంత్‌ బలవన్మరణాన్ని జీర్ణించుకోలేక సన్నిహితులు, అభిమానులు అతడి జ్ఞాపకాలతో రోజులు గడుపుతున్న భావోద్వేగ సమయంలో శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ ట్రైలర్స్‌లో అత్యధిక లైకులతో ఆల్‌టైమ్‌ రికార్డు సాధించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

కథ : కిజీ బసు(సంజనా సంఘీ)కు థైరాయిడ్‌ క్యాన్సర్‌. జంషెడ్‌పూర్‌లో ఉంటుంది. క్యాన్సర్‌ కారణంగా ఊపిరి తిత్తులు పాడైపోయిన కిజీకి ఎల్లప్పుడూ ఆక్సిజన్‌ సిలిండర్‌ వెంట ఉండాల్సిందే. అందరు అమ్మాయిల్లాగే తనకూ సాధారణ జీవితం గడపాలని ఉన్నా.. మహమ్మారి కారణంగా తరచుగా ఆస్పత్రికి వెళ్లడం, చెకప్‌లకే సగం రోజులు గడిచిపోతూ ఉంటాయి. క్యాన్సర్‌ ఏదో ఒకరోజు తనను బలితీసుకుంటుందనే విషయం కిజీకి బాగా తెలుసు. అందుకే తను వెళ్లిపోయిన తర్వాత తనను ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులు, స్నేహితులు ఎలా ఫీలవుతారో తెలుసుకునేందుకు పరిచయం లేని వాళ్ల అంత్యక్రియలకు హాజరవుతూ ఉంటుంది. (బై ముంబై.. వెళ్లిపోతున్నా: హీరోయిన్‌)

ఇలాంటి సమయంలో తనకు ఓ రోజు కాలేజీలో ఇమాన్యుయేల్‌ రాజ్‌కుమార్‌ జూనియర్‌- మ్యానీ(సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌) పరిచయమవుతాడు. ఆ తర్వాత క్యాన్సర్‌ సపోర్టు గ్రూపులో మరోసారి కనిపిస్తాడు. కిజీలాగే మ్యానీ కూడా క్యాన్సర్‌ పేషెంట్‌. ఆస్టియోసర్కోమా తనను పీడిస్తూ ఉంటుంది. నటనను ప్రాణంగా ప్రేమిస్తూ, తలైవా రజనీకాంత్‌ను ఆరాధిస్తూ ఎంతో చలాకీగా ఉండే మ్యానీ వ్యక్తిత్వం కిజీకి బాగా నచ్చుతుంది. అలా కొన్ని రోజుల్లోనే ఇద్దరి మధ్య స్నేహం బలపడతుంది. 

అయితే కొన్ని కారణాల దృష్ట్యా మన్నీ తనకు ‘పూర్తిగా’ దగ్గరవకుండా ఉండటం కోసం కిజీ.. అతడికి దూరదూరంగానే ఉంటుంది. కానీ దగ్గరవొద్దంటే దూరంగా ఉండే రకం కాదు మ్యానీ.. నీ దూరం నీది.. నా దగ్గర నాది అన్నట్లుగా ఆమెతో బంధం పెనవేసుకుంటాడు. అలా నిస్సారంగా.. సాదాసీదాగా సాగిపోతున్న కిజీ జీవితంలో ప్రవేశించిన మ్యానీ ఆమెకు ఎలాంటి అనుభూతులు పంచాడు? కిజీ ప్రేమను ఎలా పొందగలిగాడు?  చివరికి వారి జీవితాలు ఎలాంటి ముగింపు తీసుకున్నాయనేదే ఈ సినిమా కథ. (ఆ పెయింటింగ్‌.. ఆ పోస్టు.. ముందే చెప్పావా సుశాంత్‌?)

భావోద్వేగ కథనం.. చివరికి?
జంషెడ్‌పూర్‌లో కిజీ బసు, ఆమె కుటుంబ పరిచయంతో సినిమా మొదలవుతుంది. కాన్సర్‌ పేషెంట్‌గా ఎలాంటి సంతోషాలకు నోచుకోకుండా గడుపుతున్న కిజీ లైఫ్‌లోకి వచ్చిన మ్యానీ ఒక్కసారిగా.. ఆమె లోకాన్ని రంగులమయం చేస్తాడు. ఎప్పుడూ గుంభనంగా ఉండే ఆమె ముఖంపై నవ్వులు పూయిస్తాడు. కిజీ కూడా మ్యానీ కంపెనీని బాగా ఎంజాయ్‌ చేస్తుంది. అయితే కిజీ తల్లికి మాత్రం కూతురు.. ఇలా ఓ అబ్బాయితో కలిసి తిరగుతుండటం కాస్త ఆందోళన రేకెత్తిస్తుంది. ఓ సాధారణ తల్లిగా కొన్ని భయాలు ఆమెను వెంటాడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో తన స్నేహితుడు జగదీశ్‌ పాండే తీస్తున్న షార్ట్‌ ఫిలింలో హీరోయిన్‌గా నటిచేందుకు కిజీని ఒప్పిస్తాడు మ్యానీ.

ఇదిలా ఉండగా.. సంగీత ప్రియురాలైన కిజీకి తన అభిమాన సింగర్‌ అభిమన్యు వీర్‌(సైఫ్‌ అలీఖాన్‌) రాసిన పాట ఎందుకు అసంపూర్తిగా ఉందో తెలుసుకోవాలనే ఆలోచన వెంటాడుతుంది. ఈ విషయాన్ని మ్యానీతో పంచుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వీర్‌ను కలిసేందుకు ఫారిన్‌ వెళ్తారు. ఇక అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు కిజీని నిరాశకు గురిచేసినా... పాట పూర్తి చేయాలనే తన కోరికను మన్నించడంతో కాస్త సంతోషపడుతుంది. ఆ తర్వాత చోటుచేసుకునే విషాదకర పరిణామాలతో ముగిసే ఈ సినిమా దర్శక దిగ్గజం మణిరత్నం ‘గీతాంజలి’ని తప్పక గుర్తు చేస్తుంది.(సుశాంత్‌ది ఆత్మహత్యా? హత్యా: కంగన ఫైర్‌)

ఎవరెలా నటించారంటే..
ఈ సినిమాకు హీరోహీరోయిన్ల నటనే ప్రాణప్రతిష్ట చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మ్యానీ పాత్రలో ఒదిగిపోయిన సుశాంత్‌ తన సహజమైన నటనతో కట్టిపడేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అందరి చేతా కంటతడి పెట్టించాడు. ఇక ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంజన కూడా కిజీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు పాత్రలకు న్యాయం చేశారు. 

విశ్లేషణ
‘ద ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’ అనే హాలీవుడ్‌ సినిమాకు దిల్‌ బేచారా రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. కథ సింపుల్‌గానే ఉన్నా భావోద్వేగ కథనంతో ఆద్యంతం ఎమోషనల్‌గా ప్రేక్షకులను మూవీలో లీనం చేయడంలో దర్శకుడు ముఖేశ్‌ చాబ్రా సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కథకు సుశాంత్‌ లాంటి ప్రతిభ ఉన్న నటుడిని ఎంపిక చేసుకోవడం బాగా కలిసి వచ్చింది. స్వర మాంత్రికుడు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం సినిమాను మరో లెవల్‌కు తీసుకువెళ్లింది. సుశాంత్‌ అద్భుత నటన, భావోద్వేగ కథనం, మనసును తాకే డైలాగ్స్‌, శ్రావ్యంగా సాగే సంగీతం అన్నీ వెరసి దిల్‌ బెచారాకు ప్రేక్షకుల మదిలో స్థానం కల్పిస్తుందనడంలో సందేహం లేదు. 

చివరగా... ‘జనన మరణాలు మన చేతుల్లో లేకపోవచ్చు. ఎలా జీవించాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది’ అనే సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమా సుశాంత్‌కు గొప్ప నివాళిగా మిగిలిపోయింది. ‘‘నా జీవితంలోకి వచ్చాడు.. నవ్వడం నేర్పాడు.. నా జీవితమే తాను అయిపోయాడు.. చివరకు మళ్ళీ నన్ను ఒంటరి చేసి వెళ్లి పోయాడు’’అంటూ హీరోయిన్‌...‘‘మ్యాని మొహాన్ని, చిరునవ్వును చూడని ఈ కళ్ళు లేకపోవడమే మంచిది’’ అని కళ్లు కోల్పోయిన హీరో స్నేహితుడు చెప్పే డైలాగ్స్‌ మనసును మెలిపెడతాయి.

ఇక చిచోరే సినిమాలో ఆత్మహత్యలను వ్యతిరేకించే అనిరుద్‌ పాత్రలో స్ఫూర్తిదాయక నటన కనబరిచి, దిల్‌ బెచారాలో కాన్సర్‌ పేషెంట్‌గా కంటతడి పెట్టిస్తూనే.. బతికున్ననాళ్లు ఎంత సంతోషంగా ఉన్నామనేదే ముఖ్యమని చెప్పే మ్యానీ పాత్రలో జీవించిన సుశీ.. యాధృచ్ఛికమో, దైవ నిర్ణయమో తెలియదు గానీ సినిమా విడుదలకు ముందే ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోవడం విచారకరం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top