గంగవ్వకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శుభాకాంక్షలు

Sunke Ravishankar Congaratulations To Gangavva For Bigboss Season 4 - Sakshi

బుల్లి తెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 సందడి మొదలైంది. తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన బిగెస్ట్‌ హిట్‌ షో ఆదివారం అట్టహాసంగా మొదలైంది. వరుసగా రెండోసారి వ్యాఖ్యాతగా వ్యవహించిన టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున 16 మంది కంటెస్టెంట్లును బుల్లితెరకు పరిచయం చేశారు. అయితే వీరిలో చాలామంది వివిధ రంగాల్లో ప్రముఖ గుర్తింపు పొందినవారు కాగా... అందరికంటే ప్రత్యేకంగా నిలిచారు గిరిజన పల్లెల నుంచి వచ్చిన గంగవ్వ. గంగవ్వను బిగ్ బాస్ హౌజ్‌లో చూడగానే ఆమె ఫ్యాన్స్, సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. షో మొదలవ్వడమే ఆలస్యం #Gangavva #BiggBossTelugu4 హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తూ సోషల్‌ మీడియాను ఊపేస్తున్నారు. అంతేకాదు గంగవ్వ ఆర్మీ వచ్చేసిందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. తెలంగాణనే కాకుండా ఏపీ నుంచి కూడా ఆమెకు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. (బిస్‌బాస్‌-4 : ఇదిగో 16 మంది కంటెస్టెంట్స్‌)

హౌస్‌లోకి వెళ్లేముందు కొంచెం భయంగా ఉందంటూ ఆమె పేరుపై వచ్చిన ట్వీట్‌కు విపరీతమైన స్పందన వస్తోంది. అవ్వా.. అస్సలు భయపడ్డొద్దు.. ఇరగొట్టేయ్.. నీకు మేమున్నాం అంటూ ట్విటర్, ఫేస్‌బుక్‌లో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. నాకు బిగ్ బాస్ చూడడం ఇష్టం లేదని కానీ అత్యంత సామాన్య నేపథ్యం నుంచి బిగ్‌బాస్‌ షో వరకు ఎదిగిన గంగవ్వకు ఓట్లు మాత్రం వేస్తామని కొండంత భరోసా  ఇస్తున్నారు.  ఇక ఈ నేపథ్యంలో చొప్పదంటి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సైతం గంగవ్వకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఆయన పోస్ట్‌ చేస్తూ.. ‘మా చొప్పదండి నియోజకవర్గ అవ్వ గంగవ్వ బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు. మారుమూల పల్లె నుండి తన మాటలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది. గంగవ్వ విజేతగా నిలుస్తుందని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఎమ్మె‍ల్యే చేసిన ట్వీట్‌ను గంగవ్వ ఫ్యాన్స్‌ విపరీతంగా రీట్వీట్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top