‘అప్పటికే ఆలస్యమైంది.. రాజ్‌ పల్స్‌ ఆగిపోయింది’

Sulaiman Merchant: Mandira Bedi Rushed Raj To Hospital It Was Too Late - Sakshi

రాజ్‌ కౌశల్‌ మరణం: భావోద్వేగానికి గురైన సంగీత దర్శకుడు

ముంబై: ‘‘ఆరోజు సాయంత్రం నుంచే తను చాలా నీరసంగా ఉన్నాడు. టాబ్లెట్‌ కూడా వేసుకున్నాడు. మధ్యరాత్రి గుండె నొప్పి మొదలైంది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రాజ్ పరిస్థితి విషమించింది. తనకు గుండెలో విపరీతంగా నొప్పి వస్తోందని మందిరకు చెప్పాడు. వెంటనే తను ఆశిష్‌ చౌదరికి ఫోన్‌ చేసింది. ఇద్దరూ కలిసి రాజ్‌ను కారులో కూర్చోబెట్టి లీలావతి ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, అప్పటికే రాజ్‌ స్పృహ కోల్పోయాడు. సమయానికి హాస్పిటల్‌కు చేరుకుంటామని వారు భావించారు.

కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. పది నిమిషాల్లోనే రాజ్‌ పల్స్‌ ఆగిపోయినట్లు వారు గుర్తించారు. డాక్టర్‌ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది’’ అంటూ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు సులేమాన్‌ మర్చంట్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘ప్యార్‌ మే కభీ కభీ’’ సినిమా సమయం కంటే ముందు నుంచే రాజ్‌ కౌశల్‌తో తనకు అనుంబంధం ఉందని స్నేహితుడిని గుర్తుచేసుకున్నాడు.

బాలీవుడ్‌ దర్శకుడు, ప్రముఖ నటి మందిరా బేడి భర్త రాజ్‌ కౌశల్‌ జూన్‌ 30న కన్నుమూసిన విషయం విదితమే. గుండెపోటుతో ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో పలువురు బీ-టౌన్‌ సెలబ్రిటీలు ఆయన అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించారు. ఈ క్రమంలో... ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సులేమాన్‌ మర్చంట్‌... ‘‘రాజ్‌కు 30-32 ఏళ్ల వయస్సు ఉన్నపుడు అనుకుంటా ఒకసారి గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి తను చాలా జాగ్రత్తగా ఉండేవాడు. కానీ విధి రాత మరోలా ఉంది. 

తను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్ననాటి నుంచే నాకు పరిచయం. అంతేకాదు... తన మొదటి సినిమా ప్యార్‌ మే కభీ కభీకి నేనూ, సలీం కలిసి సంగీతం అందించాం. అప్పటి నుంచి తనతో నా అనుబంధం కొనసాగుతోంది. 25 ఏళ్ల స్నేహం మాది. తను ఎంతో మంచివాడు. తన ఇక లేడు అన్న వార్త ఇంకా జీర్ణించుకోలకపోతున్నాను. ఇంతకంటే షాకింగ్‌ మరొకటి ఉండదు’’ అని ఆవేదన  వ్యక్తం చేశాడు. కాగా మందిరా బేడి- రాజ్‌ కౌశల్‌ 1999లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2011లో వీరికి కుమారుడు జన్మించగా, వీర్‌గా నామకరణం చేశారు. అంతేగాక గతేడాది జూలైలో తార అనే నాలుగేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top